Credit Card : క్రెడిట్ కార్డు అంటే ప్రస్తుత కాలంలో నిజంగా ఒక రకంగా వరమే. నెల తిరిగేదాకా డబ్బులు లేకపోయినా కావాల్సినవి కొనుక్కోవచ్చు. టైమ్‌కి బిల్లు కడితే అదనంగా డబ్బులు కూడా వెనక్కి వస్తాయి. కానీ చాలామంది క్రెడిట్ కార్డును ఎలా వాడాలో సరిగ్గా తెలుసుకోకుండా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కొన్ని తప్పులు చేస్తే మాత్రం మీ జేబుకు భారీగా చిల్లు పడటం ఖాయం. అవేంటో ఇప్పుడు చూద్దాం!
* “మినిమం అమౌంట్ కడితే చాలు” అనుకుంటే అంతే సంగతులు! క్రెడిట్ కార్డుల మీద వడ్డీ రేట్లు ఆకాశాన్ని తాకుతుంటాయి. మీరు బిల్లులో కనీస మొత్తం (మినిమం డ్యూ) కడితే సరిపోతుందిలే అని అనుకుంటే మాత్రం మీ బకాయిల మీద భారీగా వడ్డీ పడుతుంది. లక్ష రూపాయల బిల్లు వస్తే అందులో 5-7 వేలు కట్టి ఊరుకుంటే మిగిలిన డబ్బు మీద బ్యాంకులు పండగ చేసుకుంటాయి. మీరేమో అప్పుల కుప్పలో కూర్చుంటారు.
Also Read : క్రెడిట్ కార్డు మినిమమ్ బిల్లు కడుతున్నారా.. లాభాలు నామమాత్రం.. నష్టాలు కొండంత!
* టైమ్ అంటే టైమే! లేదంటే ఫైన్ల మోత! క్రెడిట్ కార్డు బిల్లు ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు కట్టాలో చాలామంది పట్టించుకోరు. డ్యూ డేట్ దాటితే చాలు బ్యాంకులు మీకు ఫైన్ వేయడానికి రెడీగా ఉంటాయి. అంతేకాదు, మీ క్రెడిట్ స్కోరు కూడా పడిపోతుంది. భవిష్యత్తులో లోన్ కావాలంటే మాత్రం బ్యాంకులు మిమ్మల్ని అనుమానంగా చూస్తాయి.
* లిమిట్ మొత్తం వాడేశారా? క్రెడిట్ స్కోర్‌కు డేంజర్ బెల్స్! బ్యాంకులు మీ ఆర్థిక పరిస్థితిని చూసి ఒక లిమిట్ ఇస్తాయి. కానీ చాలామంది ఆ లిమిట్ మొత్తం వాడేస్తారు. “నా కార్డులో ఇంత డబ్బుంది కదా” అని ఖర్చు పెడితే అంతే సంగతులు. ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. కొన్నిసార్లు అయితే లిమిట్ దాటితే ఓవర్ లిమిట్ ఫీజు కూడా కట్టాల్సి వస్తుంది.
* ఏటీఎంలో క్రెడిట్ కార్డు పెట్టి డబ్బులు తీశారా? ఇక వడ్డీల భారం మోయాల్సిందే! చాలామంది డబ్బులు అవసరమైతే క్రెడిట్ కార్డు పెట్టి ఏటీఎం నుంచి క్యాష్ తీసుకుంటారు. ఇది మాత్రం చాలా డేంజర్. ఇలా చేస్తే బ్యాంకులు భారీగా ఫీజులు, వడ్డీలు వేస్తాయి. డెబిట్ కార్డుకు ఉన్నట్టు గ్రేస్ పీరియడ్ కూడా ఉండదు. డబ్బులు తీసిన క్షణం నుంచే వడ్డీ మీ నెత్తిన పడుతుంది.
* రూల్స్ పట్టించుకోరా? రివార్డులన్నీ గోవిందా! క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు దాని మీద ఉండే ఫీజులు, కండీషన్లు తప్పకుండా చదవాలి. వార్షిక ఫీజు, వేరే దేశాల్లో వాడితే ఫీజు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీజు ఇలా చాలా హిడెన్ ఛార్జీలు ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ట్రాన్సాక్షన్లు చేస్తే మీరు పొందే రివార్డుల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది.
Also Read : క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొంటున్నారా?
కాబట్టి క్రెడిట్ కార్డు వాడుతున్నా, కొత్తగా తీసుకోవాలనుకున్నా ఈ 5 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలివిగా వాడితే లాభాలు వస్తాయి, లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం!