Cars: భారత్ ప్రస్తుతం కేవలం అభివృద్ధి చెందుతున్న కార్ల మార్కెట్ మాత్రమే కాదు.. ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా ఒక ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రంగా ఎదుగుతోంది. ఇటీవల వెల్లడైన గణాంకాల ప్రకారం.. ఇండియాలో తయారైన 6 కార్ల మోడళ్లు దేశీయ మార్కెట్ కంటే అంతర్జాతీయ మార్కెట్లలోనే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. హోండా సిటీ, ఎలివేట్, నిస్సాన్ సన్నీ, మాగ్నైట్, హ్యుందాయ్ వెర్నా, జీప్ మెరిడియన్ ఉన్నాయి.
Also Read: ‘కూలీ’ టీజర్: రజినీకాంత్ విజిల్ సౌండ్ పాన్ ఇండియాలో వినిపిస్తుందా..?
‘మేడ్ ఇన్ ఇండియా’ సత్తా చాటిన SIAM గణాంకాలు
సోసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ (SIAM) ప్రకారం.. ఈ మార్పుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశంలో ఈ మోడళ్ల డిమాండ్ ఊహించిన దాని కంటే తక్కువగా ఉండడం.. రెండోది కంపెనీలు ప్రపంచ మార్కెట్లలో వీటి అవకాశాలను గుర్తించి అక్కడ దృష్టి సారించడం. ఉదాహరణకు, హోండా ఎలివేట్‌ను సెప్టెంబర్ 2023లో భారతదేశంలో రిలీజ్ చేశారు. కానీ దేశీయంగా దీని అమ్మకాలు మందకొడిగా సాగాయి. అయినప్పటికీ, 2025ఆర్థిక సంవత్సరంలో ఎలివేట్ 45,167 యూనిట్లు ఎగుమతి కాగా, దేశీయ అమ్మకాలు కేవలం 22,321 యూనిట్లకు పరిమితమయ్యాయి.
హ్యుందాయ్ వెర్నాకు పెరుగుతున్న డిమాండ్
హ్యుందాయ్ వెర్నాతో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. భారతదేశంలో సెడాన్ కార్ల డిమాండ్ తగ్గుతున్న కారణంగా వెర్నా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. కానీ, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాలలో దీని పాపులారిటీ హ్యుందాయ్‌కు పెద్ద ఎగుమతి స్థావరాన్ని అందించింది. 2025లో 50,000 యూనిట్లకు పైగా వెర్నా మోడల్స్ ఎగుమతి అయ్యాయి.
అదేవిధంగా, నిస్సాన్ మాగ్నైట్, జీప్ మెరిడియన్ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లలో మంచి పర్ఫామెన్స్ ను కనబరిచాయి. ఉత్పత్తిని కొనసాగించడానికి, సరఫరాదారులతో ఒప్పందాలను పూర్తి చేయడానికి కంపెనీలు ఎగుమతులను ఒక వ్యూహంగా మార్చుకున్నాయి. ఈ ట్రెండ్ భారతదేశ ఆటో రంగం ఇప్పుడు కేవలం దేశీయ డిమాండ్‌పై ఆధారపడడం లేదని చూపిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ కింద భారత్ ఒక ప్రపంచ ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా ఎదుగుతోంది. ఇది దేశానికి విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించిపెడుతుంది. ఆటో రంగంతో అనుబంధం ఉన్న ఉద్యోగాలు, పెట్టుబడి అవకాశాలను కూడా పెంచుతుంది.