BYD v/s Tesla
BYD v/s Tesla : ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాకు కష్టాలు తీరడం లేదు. చైనాకు చెందిన బీవైడీ (BYD) మరోసారి టెస్లాను వెనక్కి నెట్టింది. టెస్లా, బీవైడీ మధ్య ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో పోటీ తీవ్రమవుతోంది. ఇటీవల వార్షిక ఆదాయాల్లో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాను బీవైడీ అధిగమించింది. షెంజెన్ కేంద్రంగా పని చేస్తున్న బీవైడీ గతేడాది 107 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించినట్లు పేర్కొంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ఇదే సమయంలో టెస్లాకు వచ్చిన ఆదాయం కేవలం 97.7 బిలియన్ డాలర్లు.ఇంతకుముందు కార్ల అమ్మకాల విషయంలో కూడా బీవైడీ టెస్లాకు గట్టి పోటీ ఇచ్చింది.
ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్‌లో టెస్లాకు బలమైన స్థానం ఉంది. కొన్నేళ్లుగా చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ (BYD) నుంచి అమెరికాకు చెందిన టెస్లా (Tesla)కు గట్టి పోటీ ఎదురవుతోంది. అమ్మకాల విషయంలోనే కాకుండా టెక్నాలజీ విషయంలో కూడా బీవైడీ తన కార్లలో అనేక ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. బీవైడీ ఎలక్ట్రిక్ కార్లతో పాటు హైబ్రిడ్ కార్లను కూడా విక్రయిస్తోంది.
Also Read : భారత్ లో టెస్లా కార్ అమ్మకాలకు రంగం సిద్ధం.. సర్టిఫికేషన్ కు దరఖాస్తు
బీవైడీ 2024లో 100 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఇది టెస్లా కంటే చాలా ఎక్కువ. బ్లూమ్‌బెర్గ్ ప్రకారం బీవైడీ ఆదాయం 2024లో 777 బిలియన్ యువాన్లు (చైనా కరెన్సీ)గా ఉంది. ఇది 107 బిలియన్ డాలర్లకు సమానం. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం 9.17 లక్షల కోట్ల రూపాయలకు సమానం. ఈ సమయంలో టెస్లా ఆదాయం 97.7 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం 8.37 లక్షల కోట్ల రూపాయలు. 2023తో పోలిస్తే బీవైడీ ఆదాయంలో 29 శాతం వృద్ధి కనిపించింది. అయితే, టెస్లా ఆదాయం బీవైడీ కంటే దాదాపు 10 బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది.
కార్ల అమ్మకాల విషయంలో చూస్తే 2024లో టెస్లా ఉత్పత్తి 4 శాతం తగ్గింది. ఈ ఏడాది కంపెనీ 17.7 లక్షల కార్లను ఉత్పత్తి చేసింది. మొత్తం 17.9 లక్షల కార్లను డెలివరీ చేసింది. బీవైడీ అమ్మకాలను పరిశీలిస్తే 2024లో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 17.6 లక్షల కార్లుగా ఉన్నాయి. ఇందులో బీవైడీ హైబ్రిడ్ కార్ల అమ్మకాలు కూడా కలిపితే మొత్తం అమ్మకాల సంఖ్య 42.5 లక్షల కార్లకు చేరుకుంటుంది.
బీవైడీ ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం హైబ్రిడ్ కార్ల అమ్మకాలు పెరగడం. టెస్లా కంటే తక్కువ ధరకే కార్లను అందించడం బీవైడీకి కలిసొచ్చింది. బీవైడీ సరికొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించడం కూడా ఆ సంస్థకు ఆదాయం పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ట్రంప్‌తో మస్క్‌కు సన్నిహిత సంబంధాలు ఉండడం టెస్లా కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చైనా కార్లపై పశ్చిమదేశాల్లో భారీగా పన్నులు విధించడం కూడా బీవైడీపై ప్రభావం చూపుతోంది. భవిష్యత్తులో కూడా బీవైడీ, టెస్లా మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.
Also Read : సేల్స్ లో దూసుకుపోతున్న BYD.. ఒక్క నెలలోనే రికార్డు అమ్మకాలు..