Anant Ambani Pre Wedding: ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధికా మర్చంట్ ముందస్తు వివాహ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివారం వరకు ఇవి కొనసాగుతాయి. ఈ వేడుకలకు ప్రపంచంలోనే అతిరథ మహారధులంతా హాజరు కానున్నారు. వీరి కోసం జామ్ నగర్ ప్రాంతంలో అల్ట్రా లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేశారు. 2,500 రకాల ఆహార పదార్థాలను వడ్డించనున్నారు. వీటిని తయారు చేయడానికి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతానికి చెందిన ప్రఖ్యాత చెఫ్ లను పిలిపించారు. ప్రస్తుతం జామ్ నగర్ ప్రాంతమంతా కోలాహలంగా ఉంది. ఈ వేడుకలకు ముందు బుధవారం అంబానీ చేసిన మరో వేడుక ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
గుజరాతి సంప్రదాయం ప్రకారం ముందస్తు పెళ్లి వేడుకలను పురస్కరించుకొని కొన్ని కుటుంబాలు సంబరాలు జరుపుతాయి. దగ్గర వారిని పిలిపించుకొని తమ తాహతుకు తగ్గట్టుగా భోజనాలు పెడతాయి. ముకేశ్ అంబానీ కూడా తన కొడుకు ముందస్తు పెళ్లి వేడుకలను పురస్కరించుకొని బుధవారం 51,000 మందికి భోజనాలు పెట్టి ‘అన్న సేవా” అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. తాను, భార్య నీతా అంబానీ, చిన్న కొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధిక మర్చంట్ తో కలిసి వచ్చిన వారందరికీ దగ్గరుండి మరి భోజనాలు వడ్డించారు. ఆ భోజనాల మెనూ లోనూ గుజరాతి సంప్రదాయాన్ని పాటించారు. గుజరాతి సంప్రదాయంలో తన కొడుకు పెళ్లి తంతును సాగిస్తున్న ముకేశ్ అంబానీ.. ఇప్పటికే జామ్ నగర్ ప్రాంతంలో 14 ఆలయాలను నిర్మించారు.
వాస్తవానికి తన ఇంట్లో జరిగే ప్రతి వేడుకను ఎంతో ఆడంబరంగా నిర్వహించే ముఖేష్.. తన చిన్న కొడుకు పెళ్లి వేడుకను ఆకాశమే హద్దుగా నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే జామ్ నగర్ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు. మూడు రోజులు పాటు నిర్వహించే తన చిన్న కొడుకు మందస్తు పెళ్లి వేడుకలకు ప్రపంచం లోనే అతిరథ మహారధులందరినీ పిలిచాడు. వారికోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేశాడు. అహుతులను అలరించేలా ప్రఖ్యాతమైన గాయకులతో సంగీత విభావరి కూడా ఏర్పాటు చేయించాడు. తన కొడుకు ముందస్తు పెళ్లి వేడుకలకే ఇంత హంగామా చేస్తున్న అంబానీ.. జూలై లో జరగబోయే పెళ్లికి ఎంత హడావిడి చేస్తాడో చూడాలి మరి. అన్నట్టు తన ఇంట్లోకి రాధికా మర్చంట్ అడుగుపెట్టకముందే డిస్నీ వాల్ట్ స్టార్ తో కలిసి అతిపెద్ద మీడియా గ్రూపుగా అవతరించాడు అంబానీ. కోడలు తన ఇంట్లో కాలు మోపుతున్న వేళకు ముందే తను కోరుకున్నది జరిగింది. అందుకే కాబోలు అంబానీ మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.