Adani: ట్రేడింగ్‌లో సోమవారం అదానీ గ్రూప్‌నకు చెందిన అన్ని స్టాక్‌లు ఒక్కసారిగా భారీ లాభాలను ఆర్జించాయి. ముఖ్యంగా గౌతమ్ అదానీ ప్రతినిధులు అమెరికా ప్రభుత్వ అధికారులను కలిసి లంచం కేసులో నమోదైన క్రిమినల్ ఆరోపణలను కొట్టివేయాలని కోరారన్న వార్తల నేపథ్యంలో ఈ అనూహ్యమైన పెరుగుదల కనిపించింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో అదానీ టోటల్ గ్యాస్ ఏకంగా 11శాతం లాభంతో దూసుకుపోయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 7శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 6.6శాతం, అదానీ పోర్ట్స్ 6.3శాతం, అదానీ పవర్ 5.9శాతం మేరకు లాభపడ్డాయి.
Also Read: క్రెటా కింగ్ మేకర్ అవ్వడానికి కారణం ఈ 5 ఫీచర్లే
గతేడాది నవంబర్‌లో అమెరికా అధికారులు అదానీ, అతని మేనల్లుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ, మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ ఎస్ జైన్‌లపై అభియోగాలు మోపారు. వారు భారత ప్రభుత్వ అధికారులకు సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు పొందడానికి లంచం ఇచ్చేందుకు ఒక పథకంలో పాల్గొన్నారని, అమెరికా ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించే సమయంలో ఈ ప్రణాళికను దాచిపెట్టారని ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా వెలువడిన వార్తల ప్రకారం.. గౌతమ్ అదానీ తరపు ప్రతినిధులు అమెరికాలోని సంబంధిత ప్రభుత్వ అధికారులను కలిసి ఈ కేసు తీవ్రతను తగ్గించాలని, ముఖ్యంగా క్రిమినల్ ఆరోపణలను కొట్టివేయాలని అభ్యర్థించారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కానప్పటికీ మార్కెట్ వర్గాలు దీనిని అదానీ గ్రూప్‌నకు సానుకూల పరిణామంగా పరిగణిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అదానీ గ్రూప్ స్టాక్స్‌పై తిరిగి విశ్వాసం ఉంచినట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా హిండెన్‌బర్గ్ నివేదిక, ఇతర వివాదాల కారణంగా ఒడిదుడుకులకు గురైన అదానీ షేర్లు ఈ వార్తతో మళ్లీ ఓ రేంజ్ లో ఊపందుకున్నాయి. అదానీ టోటల్ గ్యాస్‌లో 11శాతం పెరుగుదల అత్యంత చెప్పుకోదగినది. ఇది గ్యాస్ పంపిణీ, ఇతర సంబంధిత వ్యాపారాలలో అదానీ గ్రూప్ బలమైన స్థానాన్ని సూచిస్తుంది. అలాగే, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇది గ్రూప్ ప్రధాన హోల్డింగ్ కంపెనీ, 7శాతం పెరగడం కూడా మొత్తం గ్రూప్ సానుకూల దృక్పథాన్ని తెలియజేస్తుంది.