YCP Central Office: వైసీపీ ఆఫీస్ కూల్చివేత.. ప్రతీకారం షురూ చేసిన టీడీపీ

టిడిపి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఇటీవలే సిఆర్డిఏ అధికారులు వైసిపి అగ్రనాయకత్వానికి నోటీసులు జారీ చేశారు. ఇది అక్రమ నిర్మాణం అని తేల్చారు.

Written By: Dharma, Updated On : June 22, 2024 11:39 am

YCP Central Office

Follow us on

YCP Central Office: ఏపీలో ప్రతీకార రాజకీయాలు ఉండవని కూటమి ప్రభుత్వం ఒక వైపు చెబుతోంది. మరోవైపు విధ్వంసానికి తెగబడింది. ప్రజా వేదిక కూల్చివేతతో వైసిపి పాలన ప్రారంభించారని చెప్పిన టిడిపి.. ఇప్పుడు అదే పని చేసింది. రాజధాని అమరావతి పరిధిలో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసింది. తాడేపల్లి లో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం అది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమవుతోంది. దీనిని సిఆర్డిఏ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో కూల్చివేత పనులు ప్రారంభించారు. బుల్డోజర్లు, ప్రోక్లైనర్లతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త సరిగా అక్కడ పోలీసులు మోహరించారు.

టిడిపి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో ఇటీవలే సిఆర్డిఏ అధికారులు వైసిపి అగ్రనాయకత్వానికి నోటీసులు జారీ చేశారు. ఇది అక్రమ నిర్మాణం అని తేల్చారు. ఈ నోటీసులపై శుక్రవారం వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక పిటిషన్ లను దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు వారికి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది. సిఆర్డిఏ పరిధిలో ఎలాంటి కూల్చివేత పనులు చేపట్టకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు వైసిపి నేతలు చెబుతున్నారు. సీఆర్డీఏ కమిషనర్ కు కూడా తమ న్యాయవాది ద్వారా ఈ విషయాన్ని తెలియజేశామని.. అయినా హుటాహుటిన భారీ యంత్రాలతో కూల్చివేత పనులు చేపట్టారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం ప్రతీకార రాజకీయాలకు తెర తీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నేర్పించిన ప్రజావేదికను జగన్ సర్కార్ కూల్చివేసిన విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే దీని కూల్చివేతతో పాలన ప్రారంభమైంది. దీనిని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తప్పు పట్టింది. పవన్ సైతం స్పందించారు. ఇప్పుడు అదే మాదిరిగా వైసిపి కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడంపై వైసిపి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ ఐదేళ్ల కాలంలో పాలన ఎలా ఉండబోతుందో సంకేతాలు పంపించారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం దిగిందని మండిపడ్డారు. తన దమన కాండను మరో స్థాయికి తీసుకెళ్లారని.. ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని యంత్రాలతో కూల్చివేయించారంటూ ధ్వజమెత్తారు. హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారని కూడా ఆరోపణలు చేశారు.

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షానికి సరైన గౌరవం ఇస్తున్నామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ప్రమాణ స్వీకారం నాడు ప్రతిపక్ష హోదా దక్కని వైసీపీకి ఎనలేని గౌరవం ఇచ్చామని కూడా ఎల్లో మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. కానీ ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే.. మరోవైపు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజా వేదిక కూల్చారని జగన్ సర్కార్ పై ఆరోపించిన వారే.. అదే తప్పు చేస్తున్నారని ఎక్కువ మంది తప్పు పడుతున్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపు చర్య అని మిగతా రాజకీయ పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే నిబంధనలు పాటించకపోవడం వల్లే.. సీఆర్డీఏ అధికారులు స్పందించాల్సి వచ్చిందని.. నోటీసులు ఇచ్చిన వైసిపి నాయకులు పెడచెవిన పెట్టడం వల్లే కూల్చవలసి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.