West Indies Vs USA: టి20 వరల్డ్ కప్ లో భాగంగా జరుగుతున్న సూపర్ -8 మ్యాచ్ లలో ఎట్టకేలకు వెస్టిండీస్ విజయాన్ని సాధించింది. ఇటీవల ఇంగ్లాండ్ జట్టు చేతిలో ఓటమిని ఎదుర్కొన్న వెస్టిండీస్.. శనివారం బార్బడోస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో విజయం సాధించి మళ్లీ టచ్ లోకి వచ్చింది. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి గ్రూప్ -2 లో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలోకి చేరుకుంది. ఈ విజయం ద్వారా సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన అమెరికా 19.5 ఓవర్లలో 128 పరుగులు చేసింది. గౌస్ 29 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో చేజ్, రసెల్ చెరో మూడు వికెట్లు దక్కించుకున్నారు. జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు.. ఒకానొక దశలో 48/1 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న అమెరికా.. చేజ్ దూకుడుకు క్రమంగా వికెట్లు కోల్పోయింది. 128 పరుగులకు కుప్పకూలింది.
129 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 10.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి అద్భుతమైన విజయాన్ని సాధించింది. హోప్ 82* పరుగులు చేసి మైదానంలో విధ్వంసం సృష్టించాడు.. పూరన్ పూనకాలు తెప్పించాడు. 12 బంతుల్లో 27 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ కు అసలైన అర్థం చెప్పాడు. తన ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, మూడు సిక్సర్లు కొట్టి పూరన్ ఆకట్టుకున్నాడు. ఇదే దశలో వెస్టిండీస్ ఆటగాడు గేల్ 12 సంవత్సరాల రికార్డును పూరన్ బద్దలు కొట్టాడు. టి20 వరల్డ్ కప్ ఎడిషన్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా పూరన్ చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుత ప్రపంచకప్ లో పూరన్ టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. 6 మ్యాచ్ లలో 45 సగటు, 148 స్ట్రైక్ రేట్ తో 227 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు ఉండగా.. సిక్సర్లు 17 ఉన్నాయి.. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ ఆటగాడు గేల్ పేరు మీద ఉండేది. 2012 టి20 వరల్డ్ కప్ లో గేల్ ఏకంగా 16 సిక్సర్లు కొట్టాడు. దాదాపు పుష్కర కాలం తర్వాత ఈ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో పూరన్ 17, గేల్ 16, సామ్యూల్ (15 సిక్సర్లు 2012), వాట్సన్ (15 సిక్సర్లు 2012) ఉన్నారు.