YSR Congress : ఏపీలో ( Andhra Pradesh) ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటు విషయంలో టిడిపి కూటమికి షాక్ తగిలింది. కూటమి మద్దతు ప్రకటించిన ఏపీపీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. అయితే అదే సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లలో మాత్రం టిడిపి ఘన విజయం సాధించింది. కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానం నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధించారు. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపు బాటలో ఉన్నారు. అయితే కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానం విషయంలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి బరిలో లేరు. ఎలాగైనా టిడిపి కూటమి అభ్యర్థిని ఓడించాలని అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దగా పనిచేయలేదు. వారిపై ఆధారపడిన పిడిఎఫ్ అభ్యర్థి కె ఎస్ లక్ష్మణరావు దారుణ పరాజయం చూశారు.
* మద్దతు తీసుకోవడం తప్పే
అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ మద్దతు తెలపడం వల్లే ఆయనకు ఓటమి ఎదురైందన్న విశ్లేషణ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంచి పేరు ఉంది. అన్ని వర్గాల్లో పట్టుంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయపరమైన నిర్ణయంలో భాగంగా కేఎస్ లక్ష్మణ్ రావుకు మద్దతు ప్రకటించింది. అప్పుడే సీన్ మారినట్లు తెలుస్తోంది. ఓట్ల లెక్కింపులో భాగంగా మొదటి రౌండ్ నుంచి టీడీపీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా మెజారిటీ పెంచుకుంటూ వచ్చారు. పోలైన ఓట్లలో సగానికి పైగా ఏడో రౌండ్ లోనే దక్కించుకున్నారు. దీంతో ఆయనను విజేతగా ప్రకటించారు అధికారులు.
Also Read : రాజధానిపై మారిన వైఎస్సార్ కాంగ్రెస్ స్టాండ్!
* తప్పిన అంచనా
ఈ పట్టభద్రుల స్థానంలో టిడిపి కూటమి అభ్యర్థి( TDP Alliance candidate ) వెనుకబడతారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. ఆలపాటి రాజా అభ్యర్థిత్వాన్ని సీనియర్ నేతలు వ్యతిరేకించడంతో.. తాము మద్దతు ఇస్తే పిడిఎఫ్ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధిస్తారని అంచనా వేసుకున్నారు. కానీ అక్కడ చంద్రబాబుతో పాటు లోకేష్ పట్టు బిగించారు. ఎట్టి పరిస్థితుల్లో పట్టభద్రుల స్థానాన్ని గెలవల్సిందేనని ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు హితబోధ చేశారు. దీంతో మూడు పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు గట్టిగానే పనిచేశారు. దీంతో టీడీపీ కూటమి అభ్యర్థి రాజా సునాయాస విజయం దక్కించుకున్నారు.
* వైయస్సార్ కాంగ్రెస్ కు చెంపపెట్టు
అయితే అనవసరంగా వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ మద్దతు తీసుకొని ఓట్లు కోల్పోయామని పిడిఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు అనుచరులు బాధపడుతున్నారు. అప్పటివరకు నువ్వా నేనా అన్న పరిస్థితి ఉండేదని.. ఎప్పుడైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిందో.. అప్పుడే పరిస్థితి మారిపోయిందని వాపోతున్నారు. మొత్తానికైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా మారాయి.
Also Read : వైసీపీలోకి మరో కాంగ్రెస్ నేత.. మారుతున్న మాటల తీరు!