YSR Congress Party : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టినట్టు ఉంది. ఆ పార్టీలో సీనియర్లపై ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కరిని పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మిగతా నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు హర్ష కుమార్. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. మధ్యలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. కానీ అక్కడ ఇమడలేనని భావించి తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం ప్రారంభం అయింది. అందుకు తగ్గట్టుగానే ఆయన కామెంట్స్ ఉన్నాయి.
* వ్యవహార శైలిలో మార్పు
ఇటీవల జీవీ హర్ష కుమార్ ( Gv Harsha Kumar)వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. జగన్ ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని.. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని సంచలన కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది ప్రభుత్వ ఇష్టమని.. అయితే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో మూడు సీట్లు వచ్చిన బిజెపికి ప్రతిపక్ష హోదా ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఇక్కడ సీట్ల సంఖ్య ప్రధానం కాదని.. ప్రతిపక్ష పార్టీ ముఖ్యమన్నారు హర్ష కుమార్. సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
* టిడిపి కూటమి ప్రభుత్వం టార్గెట్
హర్ష కుమార్ వరుసగా టిడిపి కూటమి( TDP Alliance ) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు. దీంతో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన వ్యవహార శైలి అనుమానాలకు తావిస్తోంది. హర్ష కుమార్ మాటలు విన్న తర్వాత ఆయన వైసీపీ గూటికి చేరడం ఖాయమనే భావనకు రాజకీయ పరిశీలకులు వస్తున్నారు. త్వరలో హర్ష కుమార్ కూడా వైసిపి తీర్థం పుచ్చుకుంటారనే టాక్ నడుస్తోంది. వాస్తవానికి హర్ష కుమార్ ఇదివరకే వైయస్సార్ కాంగ్రెస్ లో చేరాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక ఆ పార్టీ వైపు చూడలేదు. ఇప్పుడు వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్తుండడంతో జగన్లో మార్పు కనిపిస్తోంది. జగన్ స్వయంగా ఆహ్వానించడంతో హర్ష కుమార్ ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..