YSR Congress social media : మొన్నటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress ) ఓటమిలో ప్రధాన పాత్ర సోషల్ మీడియా ది. ఆ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. దానిని తిప్పి కొట్టడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఫెయిల్ అయింది. ఐప్యాక్ టీం తో అనుసంధానంగా కార్యకలాపాలు సాగించే వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా అడ్డు అదుపు లేకుండా వ్యవహరించింది. దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం పనితీరు మారడం లేదు. ఇప్పటికీ అదే తరహాలో విమర్శలు, ప్రచారం చేస్తుండడం ఆ పార్టీకే మైనస్ కాక తప్పదు. కానీ ఈ విషయాన్ని మరిచిపోయి వ్యవహరిస్తోంది సోషల్ మీడియా విభాగం. దానికి అనుకూల డిజిటల్ మీడియా విభాగం జత కలవడంతో వైయస్సార్ కాంగ్రెస్ డిఫెన్స్ లో పడుతోంది.
Also Read : మూడో విడత నామినేటెడ్ పదవులు రెడీ.. ఈసారి వారికి లేనట్టే!
* అదే పనిగా ప్రచారం..
గత కొద్ది రోజులుగా ఇద్దరు నేతలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. టిడిపి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా( YSR Congress social media ) దీనిని ఎక్కువగా ప్రొజెక్టు చేస్తోంది. అటు డిజిటల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే వారిద్దరూ అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? ఆ చాన్స్ ఉందా? అంతటి ధైర్యం చేయగలరా? అనవసరంగా ప్రభుత్వానికి టార్గెట్ అవుతారా? ఇవేవీ పట్టించుకోకుండా వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తుండడం విశేషం.
* అరుదైన చాన్స్..
తిరువూరు నుంచి టిడిపి అభ్యర్థిగా గెలిచారు కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapoodi srinivasarao). ఎక్కడో హైదరాబాదులో ఓ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్న శ్రీనివాసరావు సేవలను గుర్తించి చంద్రబాబు భుజం తట్టారు. పొత్తులో భాగంగా తిరువూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అవకాశము ఇచ్చారు. కూటమి ప్రభంజనంలో శ్రీనివాసరావు గెలిచారు. అయితే అక్కడ దశాబ్దాలుగా పాతుకుపోయిన టిడిపి శ్రేణులతో ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు సరిపోవడం లేదు. అందుకే తరచూ వివాదాలు జరుగుతున్నాయి. టిడిపి హై కమాండ్ ఎదుట ఎమ్మెల్యే శ్రీనివాసరావు నిలబడాల్సి వస్తోంది. అయితే ఆయన ఎన్నడు చంద్రబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించలేదు. లైన్ దాటి మాట్లాడలేదు. ఆవేశంగా మాట్లాడుతున్నారు. పిలిచి మాట్లాడేసరికి తగ్గుతున్నారు. మొన్నటికి మొన్న ఓ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని అల్టిమేట్ ఇచ్చారు. అయితే ఆ మరుసటి రోజు బడ్జెట్ సమావేశాల్లో ఏకంగా సీఎం చంద్రబాబుపై పాట పాడి అందరూ ఆశ్చర్యపడేలా చేశారు.
* టిడిపి వీర విధేయ నేత..
పిఠాపురం వర్మ( Pithapuram Varma) తెలుగుదేశం పార్టీకి విధేయత కలిగిన నేత. 2014లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిన వెళ్లలేదు. టిడిపి టికెట్ ఇవ్వకపోయినా అసంతృప్తి చెందలేదు. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన నేత ఆయన. అటువంటి నేత ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి దక్కలేదని పార్టీ మారుతారా? అంతలా ఆలోచన చేస్తారా? అవేవీ పరిగణలోకి తీసుకోకుండా వర్మ వైయస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం చేస్తోంది ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం. పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి చూపించే క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఈ తరహా ప్రచారం చేస్తోంది. అయితే ఇలా జరుగుతున్న ప్రచారంతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఆందోళన చెందుతున్నారు. ముద్రగడ పద్మనాభం, వంగ గీతాలాంటివారు వర్మ వైయస్సార్ కాంగ్రెస్ లోకి వస్తే తమ పరిస్థితి ఏంటని ఆలోచించేదాకా దుస్థితి ఏర్పడింది. అందుకే అంటారు చెడపకురా చెడేవు అని.
* హై కమాండ్ పట్ల గౌరవమే..
ఈ ఇద్దరు టిడిపి నేతలు అధిష్టానానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఇంతవరకు నోరు జారలేదు. తమ నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వారు అసంతృప్తి చెందుతున్నారు. అంతమాత్రాన వారు పార్టీకి గుడ్ బై చెబుతారు అంటూ ప్రచారం చేస్తుండడం అతిగా అనిపిస్తుంది. ఎదురుదెబ్బలు తగిలిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంకా గుణ పాఠాలు నేర్చుకోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇకనైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తీరు మార్చుకుంటుందా? లేదా? అన్నది చూడాలి.
Also Read : పిఠాపురం వర్మ అంతటి సాహసం చేస్తారా?