Pithapuram Varma : పిఠాపురం( Pithapuram) మాజీ ఎమ్మెల్యే వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అంతటి సాహసం చేయగలరా? ఆ చాన్స్ ఉందా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో అదే చర్చ నడుస్తోంది. గత కొద్దిరోజులుగా వర్మ చుట్టూ అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. టిడిపిలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని వర్మ భావిస్తున్నారని.. పవన్ కళ్యాణ్ ఉండగా పిఠాపురంలో టికెట్ దక్కే ఛాన్స్ లేదని.. ఇలా ఎన్నో విధాలుగా ప్రచారం జరుగుతోంది. అందుకే వర్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం ఉత్తమమని సూచించిన వారు ఉన్నారు. అయితే టిడిపిని విడిచిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వర్మ వెళ్ళగలరా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. అయితే ఆ చాన్సే లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కానీ ఏ సంబంధం లేని ప్రత్యర్థులు మాత్రం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని తేల్చి చెబుతుండడం విశేషం.
Also Read : వైసీపీతో టచ్ లో వర్మ.. ముద్రగడ కుమార్తె షాకింగ్ కామెంట్స్!
* టిడిపి తో అనుబంధం
వర్మ తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) అభిమాని. ఆ పార్టీతో ఆయనకు అనుబంధం ఎక్కువ. 2014లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం ఉండేది. కానీ ఆ పార్టీలోకి వెళ్లలేదు వర్మ. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కాదని అత్యధిక మెజారిటీతో గెలిచారు. అటు తరువాత తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఒకటి తన ప్రభావం చూపుకున్నారు. మళ్లీ తన సొంత పార్టీ గూటికి చేరారు. అయితే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు. కానీ ఫలితాలు వచ్చాక పదవి లేదు. జనసేన నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం లేదు. అందుకే 2014 మాదిరిగా కఠిన నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
* ఆత్మాభిమానం ఉన్న మనిషి
అయితే అప్పట్లో ఆత్మాభిమానం కోసం ఇండిపెండెంట్గా పోటీ చేశారు వర్మ. ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకుంటారని కూడా ప్రచారం సాగుతోంది. దానికి కారణం లేకపోలేదు. వర్మకు నిర్దిష్ట నియోజకవర్గం అంటూ లేదు. కేవలం ఆయనకు పిఠాపురం తోనే ప్రత్యేక బంధం. పవన్ కళ్యాణ్( Pawan Kalyan) ఉండగా.. జనసేనతో పొత్తు కొనసాగుతుండగా పిఠాపురంలో వర్మకు ఛాన్స్ దొరకదు. ఇది ముమ్మాటికీ సత్యం. కూటమి ఇచ్చే ఎమ్మెల్సీ పదవితో వర్మ సరి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి ఏమీ జరగదు. నియోజకవర్గంలో వేలు పెట్టలేరు కూడా. అందుకే వర్మ టిడిపిని విడిచి పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనకు కచ్చితంగా వస్తారు. కానీ కఠిన నిర్ణయం దిశగా ఇప్పుడే అడుగులు వేస్తారంటే కుదిరే పని కాదు.
* ప్రభుత్వానికి నాలుగేళ్ల గడువు
రాష్ట్రంలో ఇంకా కూటమి ప్రభుత్వం ( Alliance government ) ప్రారంభంలోనే ఉంది. కేవలం 10 నెలల గడువు మాత్రమే ముగిసింది. ఇంకా నాలుగేళ్ల రెండు నెలల వ్యవధి ఉంది. అందుకే వర్మ అంత సాహసం చేయరని తెలుస్తోంది. అలా చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఇప్పటివరకు అయితే ప్రజల్లోకి బలంగా వెళ్తారు. ప్రజలతో మమేకం అవుతారు. 2029 ఎన్నికల్లో ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. అయితే వర్మ ముద్రగడ పద్మనాభం తో చర్చలు జరిపారని.. జగన్ దూతగా ఆయన వచ్చి చర్చించారని లేనిపోని ప్రచారం జరుగుతోంది. సంతట్లో సడే మియా అన్నట్టు ముద్రగడ కుమార్తె దీనిపై వ్యాఖ్యానించేసరికి ఏదో జరుగుతోందన్న అనుమానం బలపడింది. కానీ ఏమీ జరగలేదని వర్మ అనుచరులు చెబుతున్నారు.
* నియోజకవర్గాల పునర్విభజన..
వర్మ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశమే లేదు. కూటమిలో ఆయనకు ఎమ్మెల్సీ ( MLC) పదవి రావడం ఖాయం. పైగా వచ్చే ఏడాది నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అవుతుంది. చాలా కొత్త నియోజకవర్గాలు తెరపైకి వస్తాయి. పిఠాపురం నియోజకవర్గ విషయంలో కచ్చితంగా వర్గీకరణ ఉంటుంది. అంతవరకు వెయిట్ చేయక తప్పని పరిస్థితి వర్మది. ఇంకోవైపు ఎమ్మెల్సీ పదవుల భర్తీ కూడా జరగనుంది. ఎమ్మెల్సీ పదవిని తీసుకొని ప్రజల్లో బలంగా ఉండి.. 2029 ఎన్నికల్లో సత్తా చాటాలన్నది వర్మ వ్యూహం. అప్పటివరకు ఆయన వెయిట్ చేస్తారని.. కేవలం సోషల్ మీడియాలో రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విష ప్రచారం తప్ప.. ఇందులో నిజం లేదని వర్మ అనుచరులు తేల్చి చెబుతున్నారు.
Also Read : వర్మను కోరుకుంటున్న పిఠాపురం ఓటర్లు.. వీడియో వైరల్!