Nara Lokesh: నారా లోకేష్ ను పలుచన చేయడానికి వైసిపి ఎప్పుడూ ముందుంటుంది. దాదాపు లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నుంచి ఇదే పరిస్థితి. చివరకు ఆయన వ్యక్తిగత విషయాలను సైతం బయటికి తెచ్చి దుష్ప్రచారం చేయడం వంటివి చూశాం. గత రెండు రోజులుగా లోకేష్ బయట ప్రపంచానికి కనిపించలేదు. దీంతో ఆయన ఏం చేస్తున్నారన్నది వైసీపీలో ఒక రకమైన ఆతృత. ఎన్నికల సీజన్ కావడంతో తెర వెనుక లోకేష్ ఏదో మంత్రాంగం జరుపుతున్నారని.. అది బయటకు తేవాలని వైసీపీ నేతలు తెగ ఆరాటపడ్డారు. కానీ విషయం బయటకు రాలేదు. దీంతో ఎలా తెలుస్తుంది అని వైసిపి నేతలు తలలు పట్టుకున్నారు. ఒక రకమైన ప్రచారం చేయడం ద్వారా లోకేష్ ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నించారు.
ఎన్నికల నిధుల సమీకరణకు లోకేష్ అమెరికా వెళ్లారని.. మనీ లాండరింగ్ కేసులో అక్కడి పోలీసులు అరెస్టు చేశారని.. ఎడిటింగ్ తో కూడిన ఓ వీడియోను బయటకు వదిలారు. అయితే అమెరికా లాంటి అగ్రరాజ్యంలో అరెస్టు.. ఆపై మీడియా ప్రభావం ఉంటే ఈ విషయం క్షణాల్లో బయటపడుతుంది. కానీ ఈ చిన్న పాటి లాజిక్ తెలియక.. తమ పాత వైఖరిని బయట పెట్టుకున్నారు. తప్పుడు ప్రచారానికి తెర తీశారు. తాము చేసినది ఫేక్ ప్రచారమేనని తెలిసినా.. లోకేష్ ఏం చేస్తున్నారన్న ఆత్రుత వారితో ఆ పని చేయించింది. కానీ లోకేష్ గురించి టిడిపి నేతలు ఎవరూ నోరు తెరవలేదు. కానీ వైసీపీ ప్రయత్నాలను తప్పుపడుతూ నవ్వుకుంటూ ఊరుకున్నారు.
అయితే ఇక్కడే లోకేష్ లాజిక్ ప్లే చేశారు. వైసిపి ఆత్రుతను రెట్టింపు చేసేలా.. వారిలో ఆందోళన నిలిపేలా.. కొన్ని షాకులతో కూడిన ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. వైసీపీకి వీర విధేయుడు, జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ప్రచారంలో ఉన్న భీమనాథం భరత్ రెడ్డి తనతో దిగిన ఫోటోను లోకేష్ సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో వైసిపి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. భరత్ రెడ్డి సిమ్స్ కాలేజీలు నడుపుతుంటారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అటువంటి నాయకుడు లోకేష్ ను ఇటీవల కలిశారు. అదే ఫోటోను లోకేష్ విడుదల చేసేసరికి వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది.
ఎన్నికల సీజన్ కావడం, ఎన్నికల వ్యూహాల్లో లోకేష్ భాగస్తులు అవుతుండడం వైసీపీ శ్రేణులకు తెలుసు. వాటిని తెలుసుకునేందుకు వైసిపి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మొన్న ఆ మధ్యన చంద్రబాబు అరెస్టు సమయంలో.. లోకేష్ ఎక్కువగా ఢిల్లీలో గడిపారు. ఆయన ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎవరెవరిని కలిశారు? అనే వివరాల సేకరణ పనిలోనే వైసిపి బ్యాచ్ ఉండేది. చంద్రబాబుకు బెయిల్ లభించడం వెనుక లోకేష్ లాబీయింగ్ ఉంది అని వైసిపి అనుమానిస్తోంది. అప్పటినుంచి లోకేష్ కనిపించుకుంటే చాలు.. ఎక్కడో ఏదో జరిగిపోతుందని ఆందోళనతో వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. లోకేష్ పై ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. దానిపై సైతం లోకేష్ కౌంటర్ అటాక్ చేస్తుండడంతో వైసీపీలోనే ఒక రకమైన గందరగోళ పరిస్థితి నెలకొంటుంది.