Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: జగన్ ను కలవర పెడుతున్న షర్మిల సంచలన నిర్ణయం

YS Sharmila: జగన్ ను కలవర పెడుతున్న షర్మిల సంచలన నిర్ణయం

YS Sharmila: వైఎస్ షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. ఎన్నికల్లో ఆమె కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా దీనిపై ప్రచారం జరుగుతున్నా.. ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.కడప జిల్లా కాంగ్రెస్ నేతలతో ఈరోజు షర్మిల సమీక్షించనున్నారు. ఈ సమావేశం అనంతరం కడప ఎంపీ సీటు విషయంలో తన నిర్ణయాన్ని షర్మిల ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో.. సమీకరణలు శరవేగంగా మారనున్నాయి.దీంతో అందరి దృష్టి ఆమె నిర్ణయం పై ఉంది.

కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని షర్మిలపై అధిష్టానం నుంచి ఒత్తిడి ఉంది. రాహుల్ గాంధీ తన జోడోయాత్ర సందర్భంగా ఇదే విషయంపై షర్మిల తో మాట్లాడినట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో రాజకీయం మార్చితే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా మారుతుందని.. కాంగ్రెస్ ఉనికి ప్రారంభమవుతుందని పార్టీ హై కమాండ్ పెద్దలు ఆశిస్తున్నారు. అందుకే షర్మిలను పట్టు పట్టి మరి కడప నుంచి బరిలో దించాలని చూస్తున్నారు. గతంలో ఆమె ఎన్నడు ప్రత్యక్ష ఎన్నికల్లో దిగలేదు. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నంతవరకు ఆ అవసరం రాలేదు. రాజకీయాల వైపు చూడలేదు. కానీతన సోదరుడు రాజకీయంగా కష్టకాలంలో ఉండగా షర్మిల అండగా నిలబడ్డారు.పాదయాత్ర చేశారు. ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో దిగనుండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కడప జిల్లాలో డిఎల్ రవీంద్ర రెడ్డి లాంటి సీనియర్లను సమావేశానికి ఆహ్వానించారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించాక తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

ఒకవేళ షర్మిల కడప ఎంపీ సీటుకు పోటీ చేస్తే రాజకీయంగా వైసిపికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లలో దాని ప్రభావం పడనుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. విపక్షాలన్నీ కూటమి కట్టాయి. కడప జిల్లాలో సైతం పట్టు బిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల పోటీ చేస్తే విపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉంది. అవసరమైతే కడప పార్లమెంట్ స్థానం పరిధిలో విపక్షాలన్నీ షర్మిలకు మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయాలకు అతీతంగా జగన్ పాలనపై రెఫరండంగా షర్మిల పోటీకి దిగితే మాత్రం విపక్షాలన్నీ మద్దతు తెలిపే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

కడప జిల్లాలో వైయస్ కుటుంబానికి మంచి పట్టు ఉంది.నాలుగు దశాబ్దాలుగా ఆ జిల్లాలో రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్టు నిలుపుకుంటూ వస్తోంది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది. తల్లి విజయమ్మ, సోదరి షర్మిల రాజకీయంగా విభేదించడం ప్రారంభించారు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కుటుంబంలో అడ్డగోలుగా చీలిక వచ్చింది. దీంతో కుటుంబ చరిత్ర మసకబారింది. ఆ కుటుంబ అభిమానుల్లో సైతం ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పుడు గాని షర్మిల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. కుటుంబ అభిమానులు ఎక్కువగా ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరోవైపు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి జగన్ తిరిగి టికెట్ ఇచ్చారు. ఇది కూడా ఇబ్బందికర పరిణామమే. మొత్తానికి అయితే షర్మిల ఈరోజు తీసుకునే నిర్ణయం.. ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలకనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version