YS Jagan : వర్షాల వల్ల రెండు రాష్ట్రాలలో పల్లెలు, గ్రామాలు, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా నీట మునిగిపోయాయి. పల్లపు ప్రాంతాలు చెరువులను తలపించాయి. జనావాసాలు నదులను పోలాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి మున్నేరు వరద విపరీతంగా ప్రవహించడంతో బుడమేరు ఉప్పొంగింది. దానికి మూడుచోట్ల గండ్లు పడటంతో రాజధాని అమరావతి నిర్మించాలనుకునే ప్రాంతం, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణ, విజయవాడ జిల్లాలలో విపరీతమైన వరద పోటెత్తింది. దీంతో ప్రభుత్వం వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక ఇలాంటి వరద పరిస్థితులు ప్రస్తుతం ఉత్తరాంధ్రలోనూ ఉన్నాయి. పోర్ట్ సిటీగా పేరుపొందిన కాకినాడలోనూ వరద పోటెత్తింది. కాకినాడలోని ఏలేరు ఉప్పొంగి ప్రవహించింది. ఫలితంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం లోని అనేక గ్రామాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నీట మునిగింది. ఇప్పటికీ ఏలేరు రిజర్వాయర్ కు ఇన్ ఫ్లో ఏమాత్రం తగ్గకుండా వస్తోంది. ఈ రిజర్వాయర్ ప్రవాహం వల్ల ఇప్పటివరకు 75 వేల ఎకరాలలో వరి పంట నీట మునిగింది. ఇతర పంటలు కూడా మునిగిపోయాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా పరిశీలన చేసి.. ప్రభుత్వానికి నివేదిక అందించారు. వర్షాల వల్ల 41 వేల మంది రైతులు తమ పంటలను నష్టపోయినట్టు గుర్తించారు. అయితే వరద ఉధృతి తగ్గకపోవడంతో నష్టం తీవ్రత అధికంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నేడు జగన్ పర్యటన
పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.. పైగా వరదల వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఏలేరు వరద వల్ల మునిగిపోయిన గ్రామాలను సందర్శిస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల 15 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. ఉదయం 10:30 నిమిషాలకు పిఠాపురం చేరుకున్నారు. అక్కడినుంచి పాత ఇసుకపల్లి చేరుకున్నారు. అక్కడి నుంచి మాధవపురం వెళ్లారు. అక్కడ ప్రస్తుతం వరద బాధితులతో మాట్లాడుతున్నారు. అనంతరం యు కొత్తపల్లి మండల పరిధిలోని నాగులపల్లి, రమణక్కపేటకు జగన్ వెళతారు. అనంతరం మధ్యాహ్నం పిఠాపురానికి వస్తారు. అక్కడి నుంచి తాడేపల్లి తిరుగు ప్రయాణమవుతారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఇటీవల పవన్ కళ్యాణ్ గెలిచారు. ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఇటీవలి ఏలేరు వరద నేపథ్యంలో మునిగిపోయిన ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని వరద బాధితులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. కాగా, పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లే తాను అధికారంలోకి రాకుండా పోయానని జగన్ నమ్ముతున్నాడు.. అందువల్లే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.