Jagan: వైసీపీలో దిద్దుబాటు చర్యలు ప్రారంభమయ్యాయా? కొందరు నేతల వైఖరితోనే పార్టీకి డ్యామేజ్ జరిగిందా? అందుకే అటువంటి వారిని కట్టడి చేయాలని భావిస్తుందా? వారి నోటికి కళ్లెం పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీలో బాగా మాట్లాడే నేతలు చాలామంది ఉన్నారు. జగన్ పై వీర విధేయత వ్యక్తం చేస్తూ.. ప్రత్యర్థులపై విరుచుకుపడే నాయకులు వైసీపీలో కొదువ లేదు. అధినేతపై ఈగ వాలనివ్వరు. జగన్ ప్రభుత్వ విధానాలపై ఎవరైనా మాట్లాడినా ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. పదునైన పౌరుష పదజాలాలతో వ్యక్తిగత దాడి చేసేవారు. మీరు ఒకటి అంటే పది అంటాం అన్న రీతిలో వ్యవహరించేవారు. అయితే తొలుత వారి మాటలు ఫ్యాషన్ గా అనిపించేవి. గమ్మత్తుగా ఉండేవి. వైసీపీ శ్రేణులకు టానిక్ లా పనిచేసేవి. అయితే రాను రాను ఆ మాటలు వికటించాయి. ప్రజల్లో ఒక రకమైన ఏహ్య భావాన్ని నింపాయి. నాయకత్వం వారికి ప్రోత్సాహం అందించడం కూడా మైనస్ గా మారింది. అదే ఎన్నికల్లో ప్రభావం చూపింది. పార్టీకి దారుణ పరాజయానికి కారణమైంది.
* మంచి ఛాన్స్ దక్కినా
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.చాలామంది నేతలకు పొలిటికల్ లైఫ్ దక్కింది.ఈ క్రమంలోనే చాలామందిలో నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి. అయితే వారు సిద్ధాంత పరంగా ఎటువంటి ప్రభావం చూపలేకపోయారు. సిద్ధాంత పరంగా మాట్లాడిన సందర్భాలు కూడా తక్కువ. ప్రభుత్వవిధానాలు,రాజకీయ నిర్ణయాలపై మాట్లాడింది అంతంత మాత్రమే. నోరు తెరిస్తే ప్రత్యర్థులపై విరుచుకు పడడం పనిగా పెట్టుకున్నారు. అటువంటి వారిని నియంత్రించలేకపోయింది వైసీపీ నాయకత్వం. ఆ దూకుడు అధికారం తెచ్చి పెడుతుందని భావించింది. అయితే నేతల దూకుడు ఫలితంగా భారీ ఓటమి మూటగట్టుకుంది. అయితే అధికారం కోల్పోయిన మూడు నెలల తర్వాత దానిని గుర్తించగలిగింది.అధిగమించే ప్రయత్నం చేస్తోంది.
* అధికార ప్రతినిధులుగా 14 మంది
తాజాగా పార్టీ విధానాలపై మాట్లాడే అధికార ప్రతినిధుల జాబితాను వైసీపీ హై కమాండ్ విడుదల చేసింది. 14 మందితో ఆ జాబితాను ప్రకటించింది. పోతిన మహేష్, యనమల నాగార్జున యాదవ్, శివశంకర్ రెడ్డి, కారుమూరి వెంకట్ రెడ్డి, సుందర రామశర్మ, చల్లా మధుసూదన్ రెడ్డి,కొండా రాజీవ్ తో పాటు మరి కొంతమంది కొత్త నాయకులకు అవకాశం ఇచ్చింది. ఇకనుంచి పార్టీ విధానాలపై మాట్లాడే హక్కును వారికి ఇచ్చింది. పాత నేతలకు షాక్ ఇచ్చినంత పని చేసింది. ఇకపై పార్టీ విధానాలపై ఎవరు పడితే వారు మాట్లాడడం కుదిరే పని కాదు అని తేల్చింది.
* ఫైర్ బ్రాండ్లకు చెక్
ఇప్పటివరకు వైసీపీ నుంచి పేర్ని నాని, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ వంటి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడేవారు. వారు ఆ పార్టీ అధికార ప్రతినిధులు కూడా కారు. కానీ పార్టీ పట్ల విధేయత, జగన్ పై అభిమానం వారితో అలా మాట్లాడించేది. అయితే అలా మాట్లాడిన మాటలు జగన్ కు వినసొంపుగా ఉండేవి. కానీ పార్టీకి ఘోర పరాజయం ఎదురైన తర్వాత అసలు తత్వం బోధ పడింది. అందుకే పార్టీ లైన్ దాటవద్దని హై కమాండ్ హెచ్చరించినంత పని చేసింది. కొత్త ముఖాలను అధికార ప్రతినిధులుగా నియమించి సీనియర్లకు జగన్ ఝలక్ ఇచ్చారు.