MB University: మంచు మోహన్ బాబు.. కేవలం సినీ యాక్టర్ కాదు.. ఒక విద్యావేత్త కూడా. తిరుపతిలో పేరు మోసిన విద్యాసంస్థలు నడిపి మంచి పేరు తెచ్చుకున్నారు. శ్రీ విద్యానికేతన్ పేరిట ఉన్న విద్యాసంస్థలు.. మోహన్ బాబు యూనివర్సిటీ పేరిట మార్చి సేవలందిస్తున్నారు. అయితే ఆయన యూనివర్సిటీ పై ఇప్పుడు తిరుగుబాటు ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫీజుల వసూలు పేరిట అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అక్కడ పని చేస్తున్న అధ్యాపకులకు సైతం వేతనాలు అందడం లేదని కొత్త టాక్ ప్రారంభమైంది. దీంతో మరోసారి మోహన్ బాబు వార్తల్లో నిలిచారు. 2014-19 మధ్య ఫీజు రియంబర్స్మెంట్ విషయమై విద్యార్థులతో కలిసి ధర్నాకు దిగారు.నాటి చంద్రబాబు సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.ఇప్పుడు అదే విద్యార్థులు ఏకంగా మోహన్ బాబు యూనివర్సిటీ పై రోడ్డు ఎక్కడం ఆందోళన కలిగిస్తోంది.విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ పేరిట పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తుండడంతో.. పెద్ద దుమారమే నడుస్తోంది. ఫీజుల పేరిట పిండుకుంటున్నారని.. సరైన విద్యా బోధన జరగడంలేదని తల్లిదండ్రుల నుంచి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అదే సమయంలో బోధన, బోధనేతర సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించడం లేదని కూడా తెలుస్తోంది.
* అంచెలంచెలుగా అభివృద్ధి
తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ ఏర్పాటుచేసి వేలాదిమందికి విద్యాబోధన అందించారు మోహన్ బాబు. అదే విద్యా సంస్థ అభివృద్ధి చెంది..మోహన్ బాబు యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. కేజీ నుంచి పీజీ వరకు అక్కడ విద్య అందిస్తున్నారు. ప్రపంచానికే తలమానికంగా మోహన్ బాబు యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.క్రమశిక్షణకు, ఉత్తమ విద్యా బోధనకు కేరాఫ్ గా ఎంబి యూనివర్సిటీని తీర్చిదిద్దినట్లు కూడా ప్రకటించారు. అయితే అదే విద్యాసంస్థ నిర్వహణపై ఇప్పుడు ఆరోపణలు రావడం విశేషం.
* అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన వారసులు
సినీ,రాజకీయ రంగాల్లో రాణించారు మోహన్ బాబు.ఆయన వారసత్వంగా సినీ రంగంలో అడుగుపెట్టారు కుమారులు మంచు విష్ణు, మనోజ్. అయితే సినిమా రంగంలో ఆశించిన స్థాయిలో వారు రాణించలేకపోయారన్న విశ్లేషణలు ఉన్నాయి. విష్ణు నిర్మాతగా కూడా చాలా సినిమాలను నిర్మించారు. అవి కూడా సక్సెస్ ఫుల్ గా ఆడలేదు.సినీ రంగంలో వరుసగా నష్టాలు చవి చూశారని.. వాటిని భర్తీ చేసుకునేందుకు మోహన్ బాబు యూనివర్సిటీ ద్వారా ప్రయత్నాలు చేశారు అన్నది ప్రధాన ఆరోపణ. గతంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం టిడిపి ప్రభుత్వ హయాంలో గట్టిగానే పోరాడారు మోహన్ బాబు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సైలెంట్ కావడంపై విమర్శలు వచ్చాయి.
* పెద్ద ఎత్తున ఫిర్యాదులు
క్రమశిక్షణ, పారదర్శకతకు తాను పెద్దపీట వేస్తానని మోహన్ బాబు తరచూ చెప్పుకొచ్చేవారు. కానీ తాజాగా వస్తున్న ఆరోపణలు ఆయన చరిత్రను మసకబార్చే లా ఉన్నాయి. ఒకవైపు తల్లిదండ్రుల కమిటీలు, మరోవైపు అధ్యాపకుల బృందాలు ఉన్నత విద్యా మండలికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై మోహన్ బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.