TDP: భలే ఛాన్స్.. డబ్బులు ఇచ్చి టిడిపిలో చేరాలనుకుంటున్న ఆ నేతలు

కొంతమంది నేతల పరిస్థితి విచిత్రంగా మారింది. వైసిపి ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉండలేకపోతున్నారు. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. అయితే వైసీపీకి రాజీనామా చేసినంత ఈజీగా.. కూటమి పార్టీల్లోకి ఎంట్రీ లభించడం లేదు. అందుకు వారు చాలా కష్టపడాల్సి వస్తోంది.

Written By: Dharma, Updated On : September 11, 2024 8:36 am

TDP

Follow us on

TDP: ఏపీలో వైసిపి ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. వైసీపీలో ఉంటే తమకు భవిష్యత్తు ఉండదని భావిస్తున్న వారు కూటమి పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా టిడిపిలో జంప్ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో టిడిపి సూపర్ విక్టరీ సాధించింది. 136 అసెంబ్లీ సీట్లను సాధించి సత్తా చాటింది. కూటమిపరంగా 164 సీట్లతో పటిష్ట స్థితిలో ఉంది. ఇటువంటి సమయంలోవైసీపీ నేతలను తీసుకున్న ప్రయోజనం లేదని భావిస్తోంది. కానీ చాలామంది వైసీపీ నేతలు పార్టీని వీడుతున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు, గుంటూరు జిల్లాకు చెందిన కిలారి రోశయ్య, మద్దాలి గిరి వంటి వారు గుడ్ బై చెప్పారు. వైసిపి హయాంలో డిప్యూటీ సీఎం గా పనిచేసిన ఆళ్ల నాని సైతం వైసీపీకి దూరమయ్యారు. అయితే వైసీపీని వీడుతున్న నేతలు ఏ పార్టీలో చేరడం లేదు. అయితే వారిని కూటమి పార్టీలు తీసుకోవడానికి విముఖత చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

* వరద బాధితులకు విరాళాలు
ఏపీకి వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. విజయవాడ నగరానికి కోలుకోలేని దెబ్బతీశాయి. కనీవినీ ఎరుగని నష్టం జరిగింది. దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఈ ఒక్క ప్రకటనతో వైసీపీని వీడిన నేతలకు కొండంత ఆశ కలిగించినట్లు అయ్యింది. చంద్రబాబు పిలుపు ఇచ్చిందే తడవుగా నేతలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు. చంద్రబాబును కలిసి తమ వంతు సాయం అందిస్తున్నారు. పనిలో పనిగా టిడిపిలో చేరుతామని విన్నవిస్తున్నారు.

* రూ.50 లక్షలు ఇచ్చిన శిద్ధా రాఘవరావు
ప్రకాశం జిల్లాకు చెందిన శిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు పిలిచి మరి టిడిపి టికెట్ ఇచ్చారు. దర్శి నుంచి పోటీ చేసిన రాఘవరావు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో చంద్రబాబు ఆయన్ను క్యాబినెట్ లోకి తీసుకొని గౌరవించారు. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆయనపై వేధింపులు ప్రారంభించింది. ఆయన నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీలపై వందల కోట్ల ఫైన్ వేసింది. దీంతో బెదిరిపోయిన ఆయన వైసీపీలో చేరిపోయారు. వైసీపీలోకి తీసుకెళ్లినప్పుడు దర్శి అసెంబ్లీ టికెట్ ఇస్తామనిఆఫర్ చేశారు. కానీ ఎన్నికల్లో మొండి చేయి చూపారు. ఇప్పుడు ఆయన టిడిపిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో వరద బాధితుల సహాయార్థం పేరిట 50 లక్షల రూపాయలు అందించారు. టిడిపిలో చేరేందుకు మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారు.

* ఆ కంపెనీలది అదే పని
వైసిపి నేతల అస్మదీయ కంపెనీలు చాలా ఉన్నాయి. గత ఐదేళ్లుగా ఇవి అడ్డగోలుగా వ్యవహరించాయన్న ఆరోపణలు ఉన్నాయి. టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి పరిస్థితి కష్టంగా మారుతుంది అన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ఈ కంపెనీ యాజమాన్యాలు సైతం సరికొత్త ఆలోచన చేస్తున్నాయి. వరద బాధితుల సహాయార్థం భారీగా విరాళాలు అందించి.. తమపై ప్రభుత్వానికి ఉన్న కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేసుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో వచ్చిన వరదలు.. టిడిపిలో చేరబోయే నేతలకు, టిడిపి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న కంపెనీలకు అనుకోని వరంగా మారాయి అని చెప్పడం అతిశయోక్తి కాదు.