YS Bharathi Reddy: ఏపీలో ఎన్నికల వేళ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం జగన్ సతీమణి భారతి ఉగాది పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. తలపై అక్షతలు కూడా జల్లించుకున్నారు. అయితే గతంలో ఎప్పుడు వైఎస్ భారతి హిందూ పూజల్లో పాల్గొనలేదు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నా.. జగన్ ఒక్కరే పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకునే వారు. మఠాధిపతులు, స్వామీజీలను కలిసేటప్పుడు జగన్ ఒంటరిగానే వెళ్తారు. సర్వమత ప్రార్థనలు జరిగిన సమయంలో సైతం జగన్ ఒక్కరే హాజరవుతారు.
అయితే నిన్న జరిగిన ఉగాది వేడుకల్లో భారతి పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ సాంప్రదాయం తో పూజలు చేయడంతో పాటు ఆశీర్వచనం తీసుకోవడం, అక్షతలు వేయించుకోవడం గమనార్హం. జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం గంటా వారి పాలెం వద్ద క్యాంపులో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడే ఉగాది పూజలను ఏర్పాటు చేశారు. పూజల అనంతరం వేద పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. అయితే గతంలో ప్రసాదాన్ని కూడా భారతి తీసుకునే వారు కాదన్న ప్రచారం ఉంది. కానీ ఈ ఏడాది ఎన్నికల తోనే ఇటువంటివి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైఎస్ జగన్ మతంపై ఎప్పటినుంచో అభ్యంతరాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో బిజెపి దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. కానీ జగన్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా వైయస్ భారతి ముఖాన బొట్టు పెట్టుకోవడం, వేద పండితుల ఆశీర్వచనం తీసుకోవడం, ప్రసాదాన్ని కళ్ళకు అతుక్కోవడం వంటి దృశ్యాలను రికార్డింగ్ చేసి మీడియాకు విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల నేపథ్యంలో హిందువులను మచ్చిక చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇలా చేశారని వాదన వినిపిస్తోంది. హిందువుల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని చెరిపేసేందుకే ఇలా చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.