https://oktelugu.com/

Jagan: జగన్ ను చికాకు పెడుతున్న ఎమ్మెల్సీలు

గత ఎన్నికల్లో తన కోసం పని చేశారని, ఈ ఎన్నికల్లో పనిచేస్తారని చాలామంది నేతలకు జగన్ ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పదవులు ఇచ్చారు. అయితే ఇలా పదవులు దక్కించుకున్న వారు ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా మారారు.

Written By: , Updated On : April 10, 2024 / 09:26 AM IST
Jagan

Jagan

Follow us on

Jagan: వైసీపీకి శాసనమండలి అచ్చి రావడం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది.175 నియోజకవర్గాల గాను 151చోట్ల ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. దాదాపు 80% సీట్లను కైవసం చేసుకున్నారు. అయితే ఇన్ని సీట్లు సాధించిన వైసీపీకి శాసనమండలిలో బలం అంతంత మాత్రమే. దీంతో కీలక బిల్లులు, ప్రభుత్వ నిర్ణయాలపై గణనీయమైన ప్రభావం చూపింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో శాసనమండలిలో ప్రతి అంశంలోనూ చుక్కెదురయ్యింది. దీంతో ఒకానొక దశలో జగన్ శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం అనుమతి కోసం అర్జీ పెట్టుకున్నారు. అయితే విపక్షాలు న్యాయపోరాటం చేయడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. లేకుంటే శాసనమండలి ఏనాడో రద్దు అయ్యేది.

అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తరువాత శాసనమండలిలో వైసిపి ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. టిడిపి సభ్యులు పదవీ విరమణ తో వైసీపీకి ఛాన్స్ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో స్థానిక సంస్థల కోట కింద జరిగిన ఎమ్మెల్సీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల సంఖ్య కూడా పెరిగింది. అయితే దీంతో జగన్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. శాసనమండలిలో ఒక్క వైసీపీ సభ్యులే కనిపించాలన్న ఆత్రం పెరిగింది. ఈ తరుణంలోనే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేతులు కాల్చుకున్నారు. గత ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించింది. అప్పటి నుంచే వైసీపీ ప్రభుత్వం పై నెగిటివ్ టాక్ ప్రారంభమైంది.

గత ఎన్నికల్లో తన కోసం పని చేశారని, ఈ ఎన్నికల్లో పనిచేస్తారని చాలామంది నేతలకు జగన్ ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పదవులు ఇచ్చారు. అయితే ఇలా పదవులు దక్కించుకున్న వారు ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయంగా మారారు. మరో అధికార కేంద్రంగా తయారయ్యారు.దీంతో వైసీపీలో విభేదాలకు ఇదే ప్రధాన కారణంగా మారింది. తొలుత జగన్ లైట్ తీసుకున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్సీలు సొంత పార్టీ ఎమ్మెల్యే పై అసమ్మతి వ్యక్తం చేస్తూ వర్గ పోరుకు కారణమయ్యారు. ఎన్నికల ముంగిట ఇదో ఇబ్బందికర పరిణామమే.

మరోవైపు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఇప్పటికీ వీడుతూనే ఉన్నారు. తొలుత విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీని వీడారు. జనసేనలో చేరారు. ఆయనకు ఇంకా పదవీకాలం ఉన్నా.. తృణప్రాయంగా విడిచిపెట్టారు. తరువాత కడపకు చెందిన సి.రామచంద్రయ్య పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. అటు తరువాత హిందూపురంలో బాలకృష్ణ పై పోటీ చేసిన ఇక్బాల్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. బాలకృష్ణ పై ఓటమి తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన పార్టీని వీడారు. ఇటీవల జంగా కృష్ణమూర్తి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడిచిన నేతల్లో కృష్ణమూర్తి ఒకరు. రాష్ట్రంలో బీసీ నేత కూడా.

విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ రఘురామరాజు పార్టీకి అంటీ ముట్టునట్టుగా ఉన్నారు. ఈయన శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందినవారు. వైసిపి టికెట్ ఆశించారు. దక్కకపోయేసరికి ముందుగా తన అనుచరులను టిడిపిలోకి పంపించారు. మండల ఉపాధ్యక్షురాలు గా ఉన్న భార్యను సైతం టిడిపి తీర్థం పుచ్చుకునేలా చేశారు. అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఆయన వైసీపీలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఆది నుంచి శాసనమండలి వ్యవస్థ జగన్ ను చికాకు పెడుతోంది.