Sapota Benefits: సపోటానా అని తీసిపారేకండి.. ఈ ఎండాకాలంలో ఉపయోగాలు తెలిస్తే వదిలిపెట్టరు

సపోటా రుచికి చాలా తీపిగా ఉంటుంది. ఇందులో ఉన్న గుజ్జు లో అనేక పోషకాలు ఉంటాయి.. ఫైబర్, విటమిన్ కే, పొటాషియం, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : April 10, 2024 9:38 am

Sapota Benefits

Follow us on

Sapota Benefits: ఎండలు దంచి కొడుతున్నాయి. బయట అడుగు పెట్టాలంటేనే వణుకు పుడుతోంది. ఒకవేళ అత్యవసరమైన పని ఉండి వెళ్తే.. గొంతు తడారి పోతోంది. ఇలాంటి సమయంలో ఎంత నీరు తాగినా ఉపయోగం ఉండదు. పైగా ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు శరీరానికి సత్వర శక్తి అవసరం. అన్నింటికీ మించి విటమిన్స్, మెండుగా కావాలి. అవన్నీ దండిగా లభించే పండు ఒకటుంది. దాని పేరే సపోటా. ఆఫ్రికన్ దేశాల నుంచి కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన దేశంలోకి ప్రవేశించిన ఈ పండు కేవలం వేసవికాలంలోనే లభ్యమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండ్ల తోటలు విస్తారంగా సాగవుతున్నాయి. వేసవికాలంలో ఈ పండును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందామా..

సపోటా రుచికి చాలా తీపిగా ఉంటుంది. ఇందులో ఉన్న గుజ్జు లో అనేక పోషకాలు ఉంటాయి.. ఫైబర్, విటమిన్ కే, పొటాషియం, కాల్షియం, కాపర్, మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. సపోటాలో కాల్షియం, ఫాస్పరస్ దండిగా ఉంటాయి కాబట్టి.. ఇవి శరీరంలో ఎముకల దృఢత్వానికి సహకరిస్తాయి. ముఖ్యంగా ఆస్టియో పోరోసిస్ అనే వ్యాధి నుంచి దూరం చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, కాపర్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వివిధ కాలాల్లో తలెత్తే వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

సపోటాలో మెగ్నీషియం, పొటాషియం రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. సపోటాలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు నోరు, ఊపిరితిత్తులు, పెద్దపెగు క్యాన్సర్ లను నిరోధిస్తాయి. ఈ పండులో అధికంగా క్యాలరీలు ఉంటాయి. ఇవి శరీరానికి సత్వర శక్తినిస్తాయి. జీర్ణ క్రియను పెంపొందిస్తాయి. ఈ పండులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. నేత్ర సంబంధిత వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే “విటమిన్ ఈ” చర్మంలో తేమశాతం పడిపోకుండా కాపాడుతుంది. ముఖ్యంగా చర్మానికి సంబంధించి వచ్చే ఫ్రీ రాడికల్స్ వంటి వాటిని దూరం చేస్తుంది. యాంటీ ఏజింగ్ కాంపౌండింగ్ గా పనిచేస్తుంది.