Yellow Media: కానీ ఇప్పుడు ఆ వర్గం మీడియా ధోరణి కాస్త మారినట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో సత్యవేడు, గుంటూరు ఎమ్మెల్యేల ధోరణి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. చింతలూరు ఎమ్మెల్యే వ్యవహార శైలి కూడా తలవంపులకు కారణమైంది. కైట్ ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యుడు వ్యవహరించిన తీరు సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీసింది. అయితే వీటన్నింటినీ సాక్షి భారీగానే ప్రజంట్ చేసింది. వాస్తవానికి కంటే ఎక్కువగా.. ఏదో జరిగిపోయింది అన్నట్టుగా వార్తలు రాసింది. జగన్ అధికారంలో లేడు కాబట్టి ఇప్పుడు సాక్షి పత్రిక పూర్తిగా ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరిస్తోంది. ఇలాంటప్పుడు ఓ వర్గం మీడియా ఎలా వార్తలు రాస్తుంది? ఎలా ప్రజెంట్ చేస్తుంది? అనే అనుమానం అందరిలోనూ ఉన్నది. అయితే ఆ అనుమానాలను పటా పంచలు చేస్తూ ఆ వర్గం మీడియా ఉన్నది ఉన్నట్టుగా రాసింది. అంతేకాదు ఫాలోఅప్ స్టోరీలను కూడా పబ్లిష్ చేసింది. అయితే ఆ మీడియా అలా రాయడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి కూడా అలానే ఉండడంతో ఆ మీడియా కూడా రాయక తప్పలేదు. చంద్రబాబుతో గట్టి సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పటికీ ఆ మీడియాకు రాయలేని పరిస్థితి ఏర్పడింది.
ప్రజల్లో ఆగ్రహం మొదలైందా
అమరావతి నిర్మాణానికి, ఇతర పనులకు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. దీనిని ఏ పరిధిలో కేటాయించింది అనే విషయాన్ని పక్కన పెడితే.. గత ఐదు సంవత్సరాలతో పోల్చితే ఇది కాస్త నయమే. ఇక్కడ వరకు కూటమి ప్రభుత్వానికి వందకు వంద మార్కులు వేయవచ్చు. కానీ పరిపాలన విషయంలో.. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలు అని చంద్రబాబు విపరీతంగా ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ తో కూడా ప్రచారం చేయించారు. కానీ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారు. దానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. రాష్ట్రం ఇప్పట్లో బాగుపడే సూచనలు కనిపించడం లేదని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో నిజం ఉండొచ్చు.. దీనికి సంబంధించిన నివేదికలను చంద్రబాబు బయటపెట్టి ఉండవచ్చు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే చంద్రబాబు హామీలు ఇచ్చారా? నాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తీసుకొస్తున్నారు.. రేపటి నాడు రాష్ట్రం దివాలా తీస్తుంది అని ఆరోపణలు చేసింది చంద్రబాబే కదా. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకలా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది చంద్రబాబే కదా.. అలాంటప్పుడు సూపర్ సిక్స్ పథకాలకు ఎందుకు రూపకల్పన చేసినట్టు? ఎందుకు విపరీతంగా ప్రచారం కల్పించినట్టు? ఇప్పుడెందుకు ఆ పథకాల అమలు విషయంలో పిల్లి మొగ్గలు వేస్తున్నట్టు? అంటే అధికారంలోకి రావడం కోసం హామీలు ఇచ్చి.. తర్వాత విస్మరిస్తారా.. నమ్మి ఓటు వేసిన జనం పిచ్చి వాళ్ళ? ఇదిగో ఈ ప్రశ్నలే ఇప్పుడు క్షేత్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందువల్లే ఓ వర్గం మీడియా చంద్రబాబు కు వ్యతిరేకంగా.. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కథనాలను, వార్తలను ప్రసారం చేస్తోంది, ప్రచురిస్తోంది. మరి దీనికి చంద్రబాబు ఎలాంటి కవర్ డ్రైవ్ ఉపయోగిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.