Mazaka Trailer Review: సందీప్ కిషన్ గత చిత్రం ఊరు పేరు భైరవకోన పాజిటివ్ టాక్ దక్కించుకుంది. కమర్షియల్ గా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈసారి ఆయన పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ ఎంచుకున్నారు. ధమాకా ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా చేశారు. మజాకా చిత్రం శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా నేడు ట్రైలర్ విడుదల చేశారు. మరి మజాకా ట్రైలర్ ఎలా ఉంది? సందీప్ కిషన్ కి హిట్ దాహం తీర్చేనా?
మజాకా మూవీ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ అంశాలతో తెరకెక్కించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. కామెడీ, రొమాన్స్, యాక్షన్ ప్రధానంగా త్రినాథరావు నక్కిన రూపొందించారు. సందీప్ కిషన్ లుక్, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. హీరోయిన్ రీతూ వర్మతో సందీప్ కిషన్ కెమిస్ట్రీ బాగుంది. ఇక హీరోకి సమానంగా రావు రమేష్ రోల్ డిజైన్ చేశారు. లేటు వయసులో ప్రేమలో పడ్డ వ్యక్తిగా ఆయన పాత్ర ఉంది.
ఇక తండ్రి కొడుకు ఒకే అమ్మాయికి లైన్ వేయడం అనే పాయింట్ ని కూడా టచ్ చేశారేమో అనిపిస్తుంది. ట్రైలర్ లో మంచి కామెడీ పంచులు ఉన్నాయి. ట్రైలర్ చివర్లో బాలయ్య ప్రసాదం అంటూ… హైపర్ ఆది మందు బాటిల్ ఇవ్వడం కొసమెరుపు. జై బాలయ్య అంటూ సందీప్ కిషన్ మందు బాటిల్ ని ముద్దాడాడు. చెప్పాలంటే ట్రైలర్ ఏమంత కొత్తగా లేదు. కాకపోతే ఆద్యంతం ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం కలిగిస్తుంది.
మజాకా మూవీతో సందీప్ కిషన్ హిట్ ట్రాక్ ఎక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించాడు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు. రమేష్ దండ నిర్మాతగా ఉన్నారు.