RK Kottapaluku: తెలుగు నాటకం సుప్రసిద్ధ జర్నలిస్టులలో ఒకరిగా వేమూరి రాధాకృష్ణ కొనసాగుతున్నారు. కొన్ని విషయాలు ఆయన టెంపర్ మెంట్ మామూలుగా ఉండదు. కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. పత్రిక రెవెన్యూ, యాడ్స్ ఇటువంటి విషయాలను పట్టించుకోకుండా ముక్కుసూటిగా రాసేస్తారు. కెసిఆర్ తో కయ్యం, అంతకుముందు వైఎస్సార్ తో విభేదాలు.. జగన్మోహన్ రెడ్డితో జగడం.. ఈ కోవలోకే వస్తాయి. వీరితో ఒకరకంగా వేమూరి రాధాకృష్ణ యుద్ధమే చేశారు. తన పత్రికకు ప్రకటనల విషయంలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిసినా దూకుడుగా ముందుకు వెళ్లారు. మొహమాటం లేకుండా రాసేశారు. ఒక రకంగా ప్రతిపక్షాలు చేయాల్సిన పనికంటే ఎక్కువ చేశారు. ప్రతి విషయంలోనూ ప్రశ్నించారు. అయితే ఒక కేసీఆర్ విషయంలో మధ్యలో సంధి కుదిరినప్పటికీ.. అది దీర్ఘకాలం కొనసాగలేకపోయింది. దీంతో కెసిఆర్ – రాధాకృష్ణ మధ్య ఉప్పు నిప్పులాగానే వ్యవహారం సాగింది.. ఇప్పటికి అదే ధోరణి కొనసాగుతోంది.
చంద్రబాబు విషయంలో మాత్రం..
చంద్రబాబు విషయంలో మాత్రం రాధాకృష్ణ ఈ స్థాయిలో ఎదురుదాడికి దిగలేదు. అప్పుడప్పుడు చంద్రబాబు పరిపాలన కాలంలో జరిగిన తప్పులను కాస్త గిల్లినట్టు చూపించినప్పటికీ.. తర్వాత చంద్రబాబుకు అనుకూలంగానే రాధాకృష్ణ వ్యవహారం సాగిపోయింది. ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతోంది. కాకపోతే అప్పుడప్పుడు చంద్రబాబు పరిపాలనపై రాధాకృష్ణ తనదైన శైలిలోవిమర్శలు చేస్తున్నారు. అయితే దీని వెనక కారణాలు కూడా వేరే ఉన్నాయని మీడియా సర్కిల్లో ప్రచారం జరుగుతున్నది. ఇక తాజాగా తన పత్రికలో రాసిన కొత్త పలుకులో తనకు అలవాటైన రీతిలోనే వేమూరి రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. వల్లభనేని వంశీ అరెస్టును సరైనదేనని చెప్పారు. వంశీ అరెస్టు వల్ల ప్రజల్లో ఆగ్రహం కలగడం లేదని.. అతడు అరెస్ట్ కావాల్సిందేనని రాధా కృష్ణ వ్యాఖ్యానించాడు. అయితే ఇదే సమయంలో వల్లభనేని వంశీ డ్రైవర్ పై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన విమర్శలను.. మాట్లాడిన బూతులను రాధాకృష్ణ తన వ్యాసంలో ప్రస్తావించలేదు. అంతేకాదు చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యకాలంలో బిజెపితో కుదుర్చుకున్న పొత్తు.. చేసుకున్న తెగ దెంపులు.. ఢిల్లీ వీధిలో చేసిన పోరాటాలు రాధాకృష్ణ పేర్కొనలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం రాధాకృష్ణ ప్రకటించిన వీధి పోరాటం అని చెబుతున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయాడు. ప్రతిపక్ష స్థానాన్ని కూడా దూరం చేసుకున్నాడు. అందువల్లే అతనికి ప్రజా సమస్యలపై పోరాటం చేసే అధికారం లేదని రాధాకృష్ణ తీర్మానించాడు. కానీ ఏనాటికైనా ప్రతిపక్ష బాధ్యతను పోషించాల్సింది. కానీ ఆ విషయాన్ని రాధాకృష్ణ మరిచిపోయినట్టున్నాడు. ఇక్కడ జగన్ సుద్దపూస అని మా అభిప్రాయం కాదు. కాకపోతే చంద్రబాబు చేసిన పోరాటాన్ని ఆంధ్రుల ఆత్మగౌరవంగా.. జగన్ చేస్తున్న దాన్ని వికటించిన వీధి పోరాటంగా రాధాకృష్ణ అభివర్ణించడమే ఇక్కడ హాస్యాస్పదంగా ఉంది. జగన్ ఈ రోజున 11 సీట్లకే పరిమితం కావచ్చు. కానీ రేపట్నాడు జనాల అభిమానాన్ని పొందలేడని రాధాకృష్ణ చెప్పలేడు కదా. అన్నట్టు సూపర్ సిక్స్ పథకాల విషయంలో ఇప్పటికీ చంద్రబాబు పిల్లి మొగ్గలు వేస్తున్నాడు. ఆ విషయాన్ని ఇప్పటికి రాధాకృష్ణ రాయలేకపోతున్నాడు. రాధాకృష్ణ రాయక పోయినంత మాత్రాన నిజాలు దాగవు కదా. జనాలకు ఏ విషయంలో నైనా కొంతమేర ఓపిక ఉంటుంది. ఆ తర్వాత ఆ ఓపిక నశిస్తే ఫలితం వేరే విధంగా ఉంటుంది. ఇప్పటికైనా ఈ వాస్తవాన్ని రాధాకృష్ణ గ్రహిస్తే మంచిది.