Krishna Lanka Retining wall : వరదల్లో విజయవాడ నగరం చిక్కుకుంది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. వరద తగ్గింది. ఇప్పుడిప్పుడే సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకటి రెండు రోజులు పాటు ఇదే పరిస్థితి ఉంటే..నగరం సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది. అయినా సరే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గడం లేదు. ఇంకా ప్రమాదకర స్థితిలోనే ప్రవహిస్తోంది. ఇప్పటికీ విజయవాడ నగర ప్రజలు భయంతోనే గడుపుతున్నారు. ఇటువంటి సమయంలోనే ఒక అంశం హాట్ టాపిక్ అవుతోంది. కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మించింది తా మంటే తామేనని వైసిపి, టిడిపి వాదించుకుంటున్నాయి. గత మూడు రోజులుగా సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ ప్రాంగణంలోనే బస చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మొన్ననే జగన్ వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. కృష్ణలంక ప్రాంతంలో పర్యటించి బ్రిడ్జిపై నుంచి రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అయితే తమ నాయకుడు జగన్ చొరవ వల్లే ఈ ప్రాంతం సురక్షితంగా ఉందని వైసిపి నేతలు చెప్పుకొస్తున్నారు. దీంతో కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణం పై వైసిపి, టిడిపి మధ్య గొడవ మొదలైంది. గతంలో ఎన్నడూ చూడని విపత్తు విజయవాడ నగర ప్రజలను అతలాకుతలం చేస్తే.. అధికార విపక్షం రాజకీయ విమర్శలకు దిగడం పెను దుమారానికి కారణమవుతోంది. సోషల్ మీడియా వేదికగా కూడా రచ్చ నడుస్తోంది. వైసిపి చేస్తున్న ప్రచారానికి కూటమి పార్టీలు ధీటుగా సమాధానం చెబుతున్నాయి.
* ఎన్నికలకు ముందే ప్రారంభం
ఈ ఏడాది ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి జగన్ కృష్ణలంక రిటైనింగ్ వాల్ ను ప్రారంభించారు. 2.7 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ రిటైనింగ్ వాల్ వల్ల.. రాణి గారి తోట, భూపేష్ గుప్తా నగర్, తారక రామా నగర్, కృష్ణలంక పరిసర ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఒకవేళ ఈ రిటైనింగ్ వాల్ నిర్మించకపోయి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదని.. విజయవాడ నగరం ప్రమాదంలో పడేదని వైసీపీ చెబుతోంది. లక్షలాదిమంది ప్రజలను ప్రమాదం నుంచి తప్పించిన ఘనత జగన్ కే దక్కుతుందని వైసిపి వాదిస్తోంది.
* టిడిపి నేతలు చెబుతోంది ఇది
దీనిపై టిడిపి నేతలు వెర్షన్ మరోలా ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు విజయవాడ పై ఫోకస్ పెంచారని.. అందులో భాగంగానే రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదించారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే రిటైనింగ్ వాల్ నిర్మాణంలో సింహభాగం పూర్తయిందని.. ఈ ప్రాంతాన్ని వరద ముంపు నుంచి కాపాడింది చంద్రబాబేనని టిడిపి నేతలు వాదిస్తున్నారు.అంతటితో ఆగకుండా 2018, ఆగస్టు 19న ఇదే రిటైనింగ్ వాల్ పై.. కృష్ణానదిని పరిశీలిస్తున్న వైసీపీ సీనియర్ నేతలు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ ఫోటోలను ప్రచురిస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వర్షం కురిపిస్తుంది టిడిపి, జనసేన. అది టిడిపి హయాంలో నిర్మించింది అని ఆ రెండు పార్టీలు బలంగా వాదిస్తున్నాయి.
* వాస్తవం ఇది
వాస్తవానికి ఈ రిటైనింగ్ వాల్ మూడు దశల్లో నిర్మించాలని భావించారు. మొదటి దశలో భాగంగా 2.37 కిలోమీటర్ల పొడవున ఉన్న రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 165 కోట్లు ఖర్చు చేశారు. రెండో దశలో 1.23 కిలోమీటర్ల వాల్ నిర్మాణానికి 126 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ రెండు దశలు చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యాయి. మూడో దశలో భాగంగా 110 కోట్ల నిధులతో మరికొంత దూరం రిటైనింగ్ వాల్ నిర్మించాలని భావించారు. కానీ నిర్వాసితుల సమస్య రావడం, బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనులు పెండింగ్లో ఉండిపోయాయి. అయితే ఎన్నికలకు ముందు జగన్ కొద్దిపాటిరిటైనింగ్ వాల్ నిర్మించారు. దానినే ప్రారంభించారని టిడిపి ఆరోపిస్తోంది. దీంతో వరదల సమయంలో ఇదో రాజకీయ వైరల్ అంశంగా మారింది.