YCP Party : :మెగా కుటుంబంలో చీలిక వచ్చింది. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ వాల్ నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ వచ్చారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ సైతం మెగా ఫ్యామిలీ గానే భావించేవారు. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాల పుణ్యమా అని మెగా కుటుంబం వేరు, అల్లు కుటుంబం వేరు అన్నట్టు పరిస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ తన స్నేహితుడు అయిన శిల్పా రవి కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఆయన నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు తన ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి మద్దతు ప్రకటించారు. కానీ అప్పటినుంచి అభిమానుల మధ్య స్పష్టమైన చీలిక వచ్చింది. ఏపీలో జనసేన గెలుపుతో పతాక స్థాయికి చేరుకుంది. ఇటీవల మాటకు మాట పెరగడంతో పెద్ద అగాధమే ఏర్పడింది. దీనికి తోడు సోషల్ మీడియాలో ట్రోల్స్, దుష్ప్రచారం ఎక్కువయ్యాయి. ఎవరికి వారు డైరెక్ట్ గా కామెంట్స్ చేయకున్నా.. పరోక్ష వ్యాఖ్యలతో వాతావరణాన్ని వేడెక్కించారు. తనకు ఆర్మీ ఉందని.. వేరే హీరోల్లా అభిమానులు లేరని.. నచ్చిన వారి దగ్గరకు వెళ్తానని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. అప్పటినుంచి దుమారం రేగుతూనే ఉంది.మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానుల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంతలో అల్లు అర్జున్ మామ ఎంటర్ అయ్యారు. అదే సమయంలో జనసేన ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదైంది.
* వైసీపీ ఎంటర్
అయితే సందట్లో సడే మియా గా వైసీపీ ఎంటర్ అయ్యింది ఈ వివాదంలోకి. అల్లు అర్జున్ ను తమ వాడిగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఈ వివాదాన్ని సాక్షి మీడియా సైతం హైలెట్ చేస్తోంది. అల్లు అర్జున్ వైసీపీ మనిషి అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ నేతలు సైతం అల్లు అర్జున్ తమవాడిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇష్టమైన వారి కోసం వస్తానని.. ఎంత దూరమైనా వెళ్తానని అల్లు అర్జున్ చేసిన ప్రకటనను ఉదాహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు.
* పవన్ మాదిరిగా
చంద్రబాబు వెంట పవన్ నడిచినట్టే.. అల్లు అర్జున్ వైసీపీకి మద్దతుగా నిలుస్తారని వైసీపీ అభిమానులు చెప్పుకొస్తున్నారు. మెగా కుటుంబం, అల్లు కుటుంబం వేరని చెబుతున్నారు. అసలు అల్లు రామలింగయ్య లేనిదే.. మెగా కుటుంబం ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. సినిమా రంగంలో మెగా కుటుంబానికి వేసిన ప్లాట్ఫామ్ అల్లు రామలింగయ్య దేనని గుర్తు చేస్తున్నారు. అల్లు కుటుంబం లేనిదే మెగా కుటుంబానికి అవకాశాలు ఎక్కడని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అభిమానుల మధ్య రగడ పెరుగుతోంది.
* ఆది నుంచి ఇంతే
ఆది నుంచి జనసైనికులు అంటే వైసీపీకి పడదు. అందుకే మెగా కుటుంబంపై ఏ చిన్న అవకాశం దక్కినాప్రచారం చేసేందుకు వెనుకడుగు వేయరు.గతంలో చాలా సందర్భాల్లో దీనిని చూశాం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ పై వ్యక్తిగత కామెంట్స్ చేయడంలో వైసీపీ నేతలు ముందంజలో ఉండేవారు. కానీ ఇప్పుడు అలా కుదరదు. అందుకే మెగా కుటుంబంలో చిచ్చు పెట్టాలని భావించారు. అల్లు కుటుంబాన్ని వేరు చేసి అనుకున్నది సాధించాలని చూస్తున్నారు. అయితే ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఆ రెండు కుటుంబాలపై ఉంది.