YCP: ఏపీలో( Andhra Pradesh) కూటమి దూకుడుగా ఉంది. రాజకీయంగా దూకుడు నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ తరుణంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నగరపాలక సంస్థ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో సత్తా చాటింది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు గుంటూరు కార్పొరేషన్ ను కైవసం చేసుకుంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపాలిటీని సొంతం చేసుకుంది టిడిపి కూటమి. నాలుగు దశాబ్దాల తర్వాత విశాఖలో టిడిపి నేత మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే చివరివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం.. ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం నింపినట్లు అయింది. కుప్పంలో ఏకంగా చంద్రబాబును సవాల్ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయింది.
Also Read: ఆ విషయంలో ఇద్దరిదీ ఒకే మాట.. సీఎం, మాజీ సీఎంల ఏకాభిప్రాయం..!
* విశాఖలో టిడిపి పాగా
రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ గ్రేటర్ విశాఖ( greater Visakha ). దాదాపు పది నియోజకవర్గాల పరిధిలో జీవీఎంసీ విస్తరించి ఉంది. 98 డివిజన్లు ఇక్కడ ఉన్నాయి. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలు, భీమిలి, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ జీవీఎంసీలోనే ఉన్నాయి. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 98 డివిజన్లకు గాను 58 చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఆ పార్టీకి చెందిన గొలగాని వెంకట హరి కుమారి మేయర్ గా ఎన్నికయ్యారు. నాలుగేళ్లు తిరగకముందే.. ఇక్కడ రాజకీయ పరిస్థితులు మారాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గిపోయింది. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పెద్ద ఎత్తున టిడిపి తో పాటు జనసేనలో చేరారు. చివరకు కార్పొరేటర్లుగా ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వారసులు సైతం టిడిపికి జై కొట్టారు. దీంతో ఇక్కడ టిడిపి అభ్యర్థి పీలా శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ గా ఎన్నికయ్యారు.
* గుంటూరు మేయర్ గా రవీంద్ర
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్( Gunturu Municipal Corporation) మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. ఆ పార్టీకి చెందిన కోవెలమూడి రవీంద్ర మేయర్గా ఎన్నికయ్యారు. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పై వేటుపడిన సంగతి తెలిసిందే. దీంతో ఈరోజు అక్కడ ఎన్నిక జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు సైతం పాల్గొన్నారు. అయినా సరే ఎక్స్ అఫీషియో సభ్యుల బలంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఘనవిజయం సాధించింది. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కోవెలమూడి రవీంద్రకు 37 ఓట్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటరెడ్డికి 27 ఓట్లు లభించాయి. దీంతో రవీంద్ర మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే ఇక్కడ అధికార పార్టీకి ధీటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడడం అనేది గొప్ప విషయమే.
* టిడిపి చేతికి కుప్పం..
ఇంకోవైపు కుప్పం మున్సిపాలిటీని( kuppam municipality ) కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వై నాట్ కుప్పం అన్న స్లోగన్ వినిపించింది. తప్పకుండా సాధారణ ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని శపధం చేసింది. కానీ 2024 ఎన్నికల్లో పూర్తిగా సీన్ రివర్స్ అయింది. కుప్పం నుంచి చంద్రబాబు భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీని సైతం సొంతం చేసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 15 ఓట్లు రాగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 9 ఓట్లకు పరిమితం అయ్యారు. దీంతో టిడిపి అభ్యర్థి చైర్మన్గా ఎన్నికయ్యారు. మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించినట్లు అయింది.