Vijaya Sai Reddy : రాజకీయాల ( politics) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు విజయసాయిరెడ్డి. ఈ ఏడాది జనవరిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. రాజకీయాలు మాట్లాడనని కూడా అన్నారు. కానీ అలా ఉండలేకపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు సొంత మీడియా ఏర్పాట్లు కూడా విజయసాయిరెడ్డి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఛానల్ ఏర్పాటుకు సంబంధించి.. అన్ని ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం.
Also Read : విశాఖ, గుంటూరు, కుప్పంలో వైసీపీకి షాక్!
* వ్యతిరేక కథనాలు రావడంతో..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం ఉన్నప్పుడు.. ఎన్నికల ఫలితాల అనంతరం విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఈనాడులో ప్రత్యేక కథనాలు రావడంతో విజయసాయిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. అప్పట్లో రామోజీరావు బతికే ఉన్నారు. ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రామోజీరావుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా ఒక పత్రికతో పాటు ఛానల్ ను ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. అది మొదలు ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కూడా అదే మాటగా చెప్పుకున్నారు. ఓ మహిళ అధికారిణి వ్యక్తిగత జీవితం విషయంలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అతిగా వ్యవహరించింది. ఆ సమయంలో సైతం సొంత మీడియా ఏర్పాటు చేస్తానని విజయసాయిరెడ్డి చెప్పుకున్నారు.
* అప్పట్లో బ్రేక్ పడినా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) ఆ మధ్యన ప్రకటించారు. దీంతో మీడియా ఏర్పాటును సైతం పక్కన పెట్టినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం విజయసాయిరెడ్డి మీడియా ఏర్పాట్లను బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ న్యూస్ ఛానల్ మాజీ సీఈఓ సంప్రదింపులు జరుపుతున్నారని.. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఓ వ్యాపారి భాగస్వామ్యంతో మీడియా ఛానల్ ఏర్పాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి సన్నాహాలు విజయసాయిరెడ్డి బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
* వి ఛానల్ పేరిట..
విశ్వసనీయ సమాచారం మేరకు సదరు ఛానల్ కు ‘వీ ఛానల్’ ( V channel)అని పేరు పెట్టినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి రాజకీయాల్లో తిరిగి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. జాతీయ పార్టీలో ఆయన చేరతారని సమాచారం. ఈ తరుణంలోనే సొంత మీడియా ఛానల్ ఉంటే తనకంటూ ఒక హవా చాటుకోవచ్చని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే దసరా నాటికి విజయసాయిరెడ్డి ఛానల్ తెలుగు ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read :విశాఖపై చంద్రబాబు పక్కా ప్లాన్.. ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం!