Balashowry Vallabbhaneni: వైసిపి సిట్టింగ్ ఎంపీ జనసేన లో చేరనున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారు. వైసీపీలో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా మంత్రులను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరిని పక్కన పెడుతున్నారు. ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో కొందరు సైలెంట్ అవుతుండగా.. మరికొందరు అవకాశాలు వెతుక్కుంటూ పక్క పార్టీల్లోకి చేరుతున్నారు. ఈ జాబితాలో సీఎం జగన్ కు అత్యంత సన్నిహితమైన నేతలు సైతం ఉండడం విశేషం.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసిపికి దూరమయ్యారు. గత కొద్దిరోజులుగా పార్టీ నాయకత్వం పై ఆయన అసంతృప్తితో ఉన్నారు. గత ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసిన బాలశౌరి జగన్ కు అత్యంత విధేయుడు. ఆయనకు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానితో విభేదాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో పంచాయితీలు కూడా జరిగాయి. నాని మంత్రిగా ఉండే సమయంలో బాలశౌరికి అడుగడుగునా అవమానాలు జరిగేవి. జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయేది. కనీసం ఎంపీగా ప్రోటోకాల్ సైతం పాటించలేదని పలు సందర్భాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. అటు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో టికెట్ విషయంపై సైతం జగన్ నుంచి స్పష్టత రాలేదు. ఆయనకు తెలియకుండానే నియోజకవర్గ టికెట్ ప్రకటించడంతో బాలశౌరి ఆగ్రహంగా ఉన్నారు. జగన్ తీరుతో తీవ్ర అసహనంతో గడిపారు. అందుకే పార్టీని వీడడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు.
బాలశౌరి ఫిబ్రవరి 4న జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన ఒకసారి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారని.. మచిలీపట్నం లోక్ సభ సీటు కోరినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు పొత్తులో భాగంగా మచిలీపట్నం ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశం ఉందని.. అదే జరిగితే బాలశౌరికి లైన్ క్లియర్ అయినట్టేనని టాక్ నడుస్తోంది. జనసేనలో చేరేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా సమాచారం. బాలశౌరి వెంట ఒక మాజీ ఎమ్మెల్యే కూడా జనసేనలో వస్తారని టాక్ నడుస్తోంది. బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకు పేర్ని నానితో విభేదాలు ఉన్నాయి. అటు పేర్ని నాని పవన్ ను టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. అందుకే ఈసారి బాలశౌరి ద్వారా పేర్ని నానిని గట్టిగా దెబ్బతీయాలని పవన్ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.