YCP Members Who Did Not Come To The Assembly: ఐదేళ్లు అధికారంలో కొనసాగిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్.. మరోసారి ప్రతిపక్షంలో కూర్చున్నారు. కానీ.. ప్రతిపక్ష నేతగా ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యత సరిగా నిర్వర్తించడం లేదన్న కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. ప్రతిపక్ష సీట్లో కూర్చున్న ఆయన అసెంబ్లీలో ప్రజల తరఫున వాయిస్ వినిపించాల్సి ఉంది. కానీ.. ఆయన మాత్రం అసెంబ్లీకి వెళ్లడం లేదు. ప్రజలు మాత్రం అసెంబ్లీలో ఆయన వాయిస్ వినాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. శాసనమండలిలో కొంత మంది నేతలు మాట్లాడుతన్నప్పటికీ అది ప్రజల్లోకి చేరడం లేదు. అదే జగన్ కనుక అసెంబ్లీలో నిలబడి మాట్లాడితే దానికి వచ్చే మైలేజీ మరొలా ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తన్నాయి. తమకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం పక్కన పెడితే.. ప్రభుత్వంపై ఎంత వరకు పోరాడగలడని అన్నదే ప్రధానం. అయితే.. ఈ విషయం జగన్‌కు ఎందుకు అర్థం కావడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.
టీడీపీ కూటమి ఇటీవల అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే.. అందులోని లోటుపాట్లను అసెంబ్లీ వేదికగా బయట పెట్టాల్సిన జగన్.. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా ముఖంగా బడ్జెట్ లోపాలను వివరించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అసెంబ్లీలో నిలదీస్తే చాలా వరకు మైలేజీ వచ్చేది. మీడియా ముఖంగా మాట్లాడితే అది జనాలకు రీచ్ కాలేదని అంటున్నారు. అసెంబ్లీని కాదనుకొని జగన్ మీడియా సమావేశాన్ని నమ్ముకోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. ఆరు నెలల క్రితమే కూటమి అధికారం చేపట్టింది. అసెంబ్లీకి జగన్ రావాలంటూ కోరుతూనే ఉంది. కానీ.. ఆయన మాత్రం అలిగి ఇంట్లో కూర్చున్నాడని అంటున్నారు. దాంతో వైసీపీ మీద వ్యతిరేకత మరింత పెరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. జగన్ కోసం టీడీపీ, జనసేనల మీదనా ప్రజల మీదనా అన్న అనుమానాలు వచ్చే ప్రమాదాలూ ఉన్నాయని రాజకీయ నిపుణులు అంటున్నారు.
2014లో వైసీపీని పక్కన పెట్టిన జనాలే.. 2019లో అధికారాన్ని కట్టబెట్టారు. నాడు.. వైసీపీ కూడా సభకు వెళ్లి టీడీపీని నిలదీసింది. ఓ స్థాయిలో ఆడేసుకున్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను వెలికితీశారు. దాంతో పెద్ద స్థాయిలో ఆయనకు ప్రజల్లో మైలేజీ వచ్చింది. ఇప్పుడు మరోసారి టీడీపీ కూటమి అధికారం చేపట్టింది. కానీ.. వైసీపీ నేతలు మాత్రం ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చోవడం వల్ల మరింత వ్యతిరేకత వచ్చే చాన్స్ లేకపోలేదు. ఈ నెల 22తో బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి. మళ్లీ 2025 వరకూ వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉండదు. కొత్త బడ్జెట్ పెడితే ఆ సమయంలో మాత్రమే రావాల్సి ఉంటుంది. కానీ.. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని వైసీపీ ఎందుకు వినియోగించుకోలేకపోతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త ఏడాది బడ్జెట్ సమావేశాలకు అయినా జగన్ హాజరు అవుతారా అనేది అనుమానంగానే ఉంది. కానీ.. జగన్, ఆయన ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని బడ్జెట్ సమావేశాల కోసం అసెంబ్లీకి వస్తేనే ప్లస్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీకి వచ్చి పోరాడితేనే ప్రజల్లో పార్టీకి మైలేజీ పెరుగుతుందనే విషయాన్ని జగన్ సైతం ఎందుకు గుర్తించలేకపోతున్నారా అనేది అర్థం కాకుండా ఉంది. భవిష్యత్తులో అయినా జగన్ వీటిని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది వేచిచూడాలి మరి.