YCP: మహారాష్ట్రలో బిజెపి నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించింది. మరోసారి తనకు తిరుగు లేదని భారతీయ జనతా పార్టీ నిరూపించింది. ఇదే ఊపుతో జమిలి ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ సైతం ఇదే ఆశలతో ఉంది. జమిలిలో భాగంగా 2027 లోనే ఎన్నికలు జరుగుతాయని ఆశాభావంతో ఉంది. ఎలాగైనా అధికారంలోకి వస్తామని ధీమాతో ఉంది. జగన్ సైతం అదే ధీమాతో ఉన్నారు. పార్టీ కార్యాలయానికి వస్తున్న వారితో సమావేశం అవుతున్నారు. అయితే వైసీపీకి క్షేత్రస్థాయిలో అంత బలం ఉందా? మొన్నటి ఎన్నికల కంటే బలం పెంచుకుందా? అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసిందా? ప్రజా సమస్యలపై పోరాడిందా? కూటమి వైఫల్యాలను ఎత్తుచూపుతోందా? అంటే సమాధానం దొరకడం లేదు. ఇప్పటికీ జగన్ తన ఓటమి నుంచి గుణపాఠాలను నేర్చుకోలేదు.పార్టీ బలోపేతం పై ఫోకస్ పెట్టలేదు. కూటమి సంక్షేమ పథకాలు అమలు చేయలేదు, వైఫల్యం చెందింది అంటూ ధీమాతో ఉన్నారు. ప్రజలు ఆటోమేటిక్ గా తన వైపు వచ్చేస్తారని భావిస్తున్నారు. కానీ అది తప్పుడు అంచనా అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇలానే ఎన్నికలకు వెళ్తే మరోసారి అటువంటి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
* ఇప్పుడు కూడా వారేనా?
ప్రస్తుతం జగన్ చుట్టూ సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు మాత్రమే ఉన్నారు. అయితే వీరు వైసిపి పవర్ లో ఉంటే పని చేయగలరు అన్న విషయాన్ని జగన్ మర్చిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉందన్న విషయాన్ని మరిచి వీరినే ముందు పెడుతున్నారు. పార్టీకి సామంత రాజుగా భావించి ఒక్కో ప్రాంతాన్ని అప్పగిస్తున్నారు. గతంలో ఫెయిల్ అయిన కోఆర్డినేటర్ వ్యవస్థనే కొనసాగిస్తున్నారు. ఉత్తరాంధ్రలో బీసీలు అధికం. అక్కడ బీసీ నేతే లేరన్నట్టు విజయసాయిరెడ్డిని తీసుకెళ్లి కోఆర్డినేటర్ పదవిలో కూర్చోబెట్టారు. ప్రాంతాలవారీగా చాలా సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. పైగా వైసీపీలో రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు ఉన్నారు. అటువంటి వారితో కాకుండా ఈ ఆరుగురితో పార్టీని నడిపించాలని చూస్తున్నారు జగన్. దీంతో సీనియర్లలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తుంది. మళ్లీ పార్టీ పవర్ లోకి వచ్చిన ఆ ఆరుగురే చెలాయిస్తారన్న అనుమానం బలపడుతోంది.
* ఐపాక్ రీ ఎంట్రి
గత ఐదేళ్లలో ఐపాక్ టీం తో ఇబ్బంది పడింది వైసిపి. ప్రతి ఎమ్మెల్యే తో పాటు మంత్రి కూడా ఐపాక్ వద్దని అధినేతను విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అదే వ్యవస్థను తీసుకువచ్చారు జగన్. మళ్లీ ఐ పాక్ టీం కే ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆ ఆరుగురితోపాటు ఐపాక్ టీం తో రాజకీయం చేసుకోవాలని వైసీపీ సీనియర్లు సూచిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చెప్పినా వినలేదని.. ఇప్పుడు అధికారానికి దూరమైన అధినేత అదే తీరుతో ఆలోచిస్తున్నారని సీనియర్లు తెగ బాధపడుతున్నారు. వైసిపి అంటే రెడ్డి సామాజిక వర్గం పార్టీగా జగన్ ముద్ర వేసుకుంటున్నారని.. ఇక తాము ఏం చేయలేమని తేల్చి చెబుతున్నారు. అయితే జగన్ వైఖరితో చాలామంది సీనియర్లు మౌనం దాల్చుతున్నారు. ప్రత్యామ్నాయం ఉన్నవారు అటువైపుగా వెళ్తున్నారు. లేనివారు రాజకీయాలకు దూరంగా జరిగిపోతున్నారు.