Gudiwada Amarnath Reddy.: విశాఖ ఎర్రమట్టి దిబ్బల ఎపిసోడ్ లో వైసీపీకి షాక్ తగిలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులే అవుతోంది. అప్పుడే ఎర్రమట్టి దిబ్బలు తవ్వేశారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. ఏకంగా సెల్ఫీ వీడియోలో సవాల్ చేశారు. అధికార పార్టీని ఇరికించాలని చూశారు. నెలరోజులైంది కూటమి అధికారంలోకి వచ్చి. అక్కడ తవ్వకాలు చూస్తే నెలల కిందట చేసినట్టు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వానికి అనుకోని వరంలా మారింది ఎర్రమట్టి దిబ్బల వ్యవహారం. దోచిందే మీరు.. దొంగే దొంగ అన్నట్టు ఉందంటూ ఫైర్ కావడం ప్రారంభించింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన పనికిమాలిన పనికి పార్టీ అడ్డం బుక్కయ్యేలా ఉందని వైసీపీ శ్రేణులే వ్యాఖ్యానిస్తున్నాయి.
అధికారంలో ఉన్నప్పుడే అమర్నాథ్ వ్యవహార శైలి అభ్యంతర కరంగా ఉండేది. కార్పొరేటర్ గా ఉన్న అమర్నాథ్ ను ఎమ్మెల్యే చేశారు జగన్. ఏకంగా మంత్రి పదవి ఇచ్చేశారు. సీనియర్లు చాలామంది ఉన్నా.. వారందరినీ పక్కన పెట్టేశారు. అనుభవం ఉన్న కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావును అవమానించి మరి గుడివాడ అమర్నాథ్ కు అందెలమెక్కించారు. ఆయన పార్టీతో పాటు ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించారు. మంత్రి నన్న హుందాతనాన్ని మరిచి డాన్సులు, అనవసర వ్యాఖ్యలతో సోషల్ మీడియాకు ట్రోల్ అయ్యారు.గుడివాడ అమర్నాథ్ అంటేనే విశాఖ ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది. అందుకే ఆయన పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం లో దారుణ ఓటమి ఎదురైంది. రాష్ట్రంలో అందరికంటే 94 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. కనీస స్థాయిలో కూడా ఆయనకు ఓట్లు రాలేదు.
ప్రస్తుతం విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం నడుస్తోంది. అది కూడా విశాఖ కేంద్రంగానే జరుగుతోంది. ఈ ఎపిసోడ్ తో వైసిపి డిఫెన్స్ లో పడిపోయింది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా ఒక వెలుగు వెలిగిన విజయసాయి రెడ్డికి అండగా ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు. అందుకే విశాఖ లీడర్ల సహాయంతోనే తనపై కుట్ర జరిగిందన్న అనుమానం కూడా విజయసాయి రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. భారీగా భూముల వ్యవహారం కూడా బయటపడింది. దీంతో సాయి రెడ్డి సైలెంట్ కావాల్సి వచ్చింది. ఇటువంటి రాంగ్ టైంలో ఎర్రమట్టి దిబ్బల వద్దకు వెళ్లి సెల్ఫీ ఇచ్చారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. దీంతో ఇది అధికార కూటమికి అనుకొని వరంగా మారింది.
వాస్తవానికి ఎర్రమట్టి దిబ్బలకు సంబంధించి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నపవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై ఆయన స్పందించారు. ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. ఎర్రమట్టి దిబ్బలను జాయింట్ కలెక్టర్ పరిశీలించి విచారణ ప్రారంభించారు. కానీ ఇది తెలియని గుడివాడ అమర్నాథ్ హడావిడి చేశారు. అకస్మాత్తుగా ఎర్రమట్టి దిబ్బల వద్ద ప్రత్యక్షమయ్యారు. సెల్ఫీ తీసి అధికార పార్టీని ఇరికించాలని చూశారు. కానీ తానే ఇరుక్కున్నారు. సొంత పార్టీ శ్రేణులే గుడ్డు మంత్రి అంటూ.. గుడివాడ అమర్నాథ్ పై సెటైర్లు వేసే దాకా పరిస్థితి వచ్చింది. ఒకవైపు విజయసాయిరెడ్డి ఎపిసోడ్ తో కక్కలేక మింగలేక సతమతమవుతున్న వైసిపికి.. గుడివాడ అమర్నాథ్ కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నారు. ఇప్పటికైనా గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలను కట్టడి చేయాలని.. లేకుంటే పార్టీకి భారీ మూల్యం తప్పదని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి. పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.