YCP: వైసిపి ఉత్తరాంధ్ర పై భారీ ఆశలను పెట్టుకుంది. ఈసారి కూడా అత్యధిక సీట్లు సాధించాలని భావిస్తోంది. అందుకే అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తాడేపల్లిలో ఉత్తరాంధ్ర రీజినల్ స్థాయి సమావేశం జరిగింది. పార్టీ హై కమాండ్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్చార్జి లకు దిశా నిర్దేశం చేసింది. పోల్ మేనేజ్మెంట్ తో పాటు ప్రచార తీరుపై కీలక సూచనలు చేసింది. గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయాలని గట్టి ప్రయత్నంలో ఉంది. అయితే అది ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్న వినిపిస్తోంది. ఆ ఫలితాలు సాధించడం చాలా కష్టమని సొంత పార్టీ శ్రేణులే చెప్పుకొస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో 34 నియోజకవర్గాలకు గాను గత ఎన్నికల్లో వైసిపి ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది. ఏకంగా 28 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాలకి పరిమితం అయ్యింది. అది కూడా విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో టిడిపి గెలుపొందింది. శ్రీకాకుళంలో మరో రెండు స్థానాలను సాధించింది. విజయనగరంలో అయితే వైసిపి స్వీప్ చేసింది. 9కి 9 నియోజకవర్గాలను కైవసం చేసుకోవడం విశేషం. అయితే ఈసారి ఆ ఫలితాలు రిపీట్ అవుతాయా? ఆ ఛాన్స్ ఉందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఉమ్మడి మూడు జిల్లాల్లో టిడిపి, జనసేన కూటమి అధికార పార్టీకి గట్టి ఫైట్ ఇచ్చేలా ఉంది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో వైసిపి మూడు చోట్ల విజయం సాధించింది. ఇచ్చాపురం, పలాస, టెక్కలి,నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస,ఎచ్చెర్ల లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. పాతపట్నం, పాలకొండ, రాజాం నియోజకవర్గాలను వైసీపీ దక్కించుకుంది. 2019 ఎన్నికల్లో మాత్రం టెక్కలి, ఇచ్చాపురంలో మాత్రమే టిడిపి గెలుపొందింది. మిగతా నియోజకవర్గాలన్నీ వైసీపీ ఖాతాలో పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. ఇచ్చాపురం, పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, అముదాలవలస, పాతపట్నం, రాజాంలో టిడిపి,జనసేన కూటమి గెలిచే ఛాన్స్ ఉంది.నరసన్నపేట, పాలకొండలో గట్టి ఫైట్ ఉంటుంది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఏడు స్థానాలు టిడిపి పరమయ్యాయి. కురుపాం, సాలూరు మాత్రం వైసీపీ గెలుచుకుంది. 2019లో విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం, ఎస్ కోట,బొబ్బిలి, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గం వైసీపీ విజయం సాధించింది. ఎన్నికల్లో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది. విజయనగరం, బొబ్బిలి, ఎస్ కోట, నెల్లిమర్ల, పార్వతీపురం కూటమికి అనుకూలంగా ఉండగా.. కురుపాం, సాలూరు, చీపురుపల్లి, గజపతినగరం వైసిపికి అనుకూలంగా ఉన్నాయి.
విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 11 స్థానాల్లో టిడిపి విజయం సాధించింది. మాడుగుల, చోడవరం, అరకు,పాడేరు నియోజకవర్గం వైసీపీ గెలుపొందింది. 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలకు తప్ప మిగతా 11చోట్ల వైసీపీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి మారనుంది. జనసేన బలంగా ఉన్న జిల్లాల్లో విశాఖ ఒకటి. మరోవైపు విశాఖ నగరంలో ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అధికం. వారంతా బిజెపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ లెక్కన ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి స్పష్టమైన ఆధిక్యత కనబరిచే అవకాశాలు ఉన్నాయి. మాడుగుల, అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం వైసిపి హవా కనిపిస్తోంది. అందుకే ఉత్తరాంధ్ర విషయంలో వైసీపీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కానీ మెరుగైన ఫలితాలు వస్తాయా లేదా అన్నది చూడాలి.