https://oktelugu.com/

Miss World 2024: మిస్ వరల్డ్ అందాల యువతులు.. తెర వెనుక చేసే ఈ సేవకు సలాం కొట్టాల్సిందే

నేపాల్ లోని ఉప్పర్దంగ్ గాడి గ్రామానికి చెందిన ప్రియాంక రాణి జోషి మహిళల ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తున్నారు. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలకు విద్యుత్ ను సరఫరా చేసేలా కృషి చేస్తున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 10, 2024 / 11:42 AM IST

    Miss World 2024

    Follow us on

    Miss World 2024: మిస్ వరల్డ్ అంటే చాలు ఎవరైనా అందగత్తెలను నిర్ణయించే పోటీలే కదా అంటారు. సంవత్సరాల నుంచి వారి మెదడులో అటువంటి భావన పేరుకుపోయింది కాబట్టి.. ఆ పదం వినిపిస్తే వారికి అలానే అనిపిస్తుంది. కానీ మిస్ వరల్డ్ అంటే అందమైన పోటీలే.. కానీ దాని వెనుక బ్యూటీ విత్ బ్రెయిన్ అనే థీమ్ కూడా ఉంది. అందులో నెగ్గిన వారే విజేతవుతారు. వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ధరిస్తారు.. సరే విజేత సంగతి పక్కన పెడితే.. మిస్ వరల్డ్ పోటీలో బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే అంశం కూడా ఉంది ఈసారి మిస్ వరల్డ్ నిర్వాహకులు బ్యూటీ విత్ ఏ పర్పస్ విభాగంలో పదిమంది యువతులు చేస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంతకీ ఆ యువతులు ఏం చేశారు? ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఆండ్రి వెనెస్సా, ఇండోనేషియా

    ఆండ్రి వెనెస్సా అందమైన యువతి మాత్రమే కాదు.. అంతకుమించిన సేవా తత్పరురాలు కూడా.. ఇండోనేషియాలో పిల్లలపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయనే కారణంతో బ్రేక్ ది సైలెన్స్ అనే ప్రాజెక్టును రూపొందించింది. అయితే ఈ లైన్ కి వేధింపులకు సంబంధించి అక్కడి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదు. అందువల్ల బాధితుల సమస్యలు వెలుగులోకి రావడం లేదు. పైగా ఆ తరహా కేసులను అక్కడ కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వారి కోసం ఆండ్రి వెనెస్సా రూపొందించిన బ్రేక్ ది సైలెన్స్ అండగా నిలుస్తోంది. వారి సమస్యలను ప్రపంచానికి తెలియజేస్తోంది.
    ఆండ్రి వెనెస్సా మిస్ ఇండోనేషియాగా ఎన్నికైనప్పటికీ ఆమె తన బ్రేక్ ది సైలెన్స్ పనులను నిలిపివేయలేదు.

    ప్రియాంక రాణి జోషి, నేపాల్

    నేపాల్ లోని ఉప్పర్దంగ్ గాడి గ్రామానికి చెందిన ప్రియాంక రాణి జోషి మహిళల ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తున్నారు. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆధ్వర్యంలో మారుమూల గ్రామాలకు విద్యుత్ ను సరఫరా చేసేలా కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు అపారమైన అవకాశాలు కల్పించేలాగా వేదికలను సృష్టిస్తున్నారు. వారి మెరుగైన జీవనానికి తోడ్పాటు అందిస్తున్నారు.

    నర్సేనా సే, టర్కీ

    నర్సేనా సే అందమైన యువతి మాత్రమే కాదు. అంతకుమించిన దయార్ద్ర హృదయురాలు. రెడ్ క్రాస్ తో సహా అనేక మానవతావాద సంస్థలలో స్వచ్ఛంద సేవకురాలుగా పని చేశారు. భూకంపం కారణంగా తమ దేశంలో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఆమె సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా పిల్లలకు నాణ్యమైన విద్య అందేలాగా కృషి చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాలలో సామూహిక గృహాల నిర్మాణానికి ఆమె నడుం బిగించారు.

    క్రిష్టినా, చెక్ రిపబ్లిక్

    మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న చెక్ రిపబ్లిక్ సుందరి.. సేవలోనూ ముందుంటుంది. ఆఫ్రికాలోని టాంజానియాలో పేద పిల్లల కోసం ఒక పాఠశాల ఏర్పాటు చేసింది. అక్కడ వారికి విద్యా బుద్ధులు నేర్పేందుకు ఏకంగా ఉపాధ్యాయురాలి అవతారమెత్తింది. ప్రస్తుతం మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న నేపథ్యంలో త్వరలో తన దేశంలో వృద్ధులు, దివ్యాంగులు, పేదల కోసం ఆశ్రమాలు నిర్మిస్తామని చెబుతోంది.

    సోఫియా షామియా, ఉక్రెయిన్

    రష్యా వల్ల తమ దేశంలో కొనసాగుతున్న యుద్ధం అనేక మందిని ప్రభావితం చేసింది. చాలామంది బాధితులుగా మిగిలిపోయారు. సర్వం కోల్పోయి రోడ్డు మీద పడ్డారు. అలాంటి వారి కోసం తన వంతు సాయం చేస్తోంది సోఫియా. తన దేశ ప్రజల కోసం ఆమె స్వచ్చంద సేవకురాలుగా మారింది. యుద్ధం వల్ల తీవ్రంగా ప్రభావితమైన పిల్లలను art therapy ద్వారా మామూలు మనుషులను చేస్తోంది. తాను చిత్రించిన లాస్ట్ చైల్డ్ హుడ్ అనే పెయింటింగ్ ను విక్రయించి ఆ నిధులను ఎల్వివ్ లోని మ్రియా కేంద్రానికి అందజేశారు.

    హలీమా కోప్వే, టాంజానియా

    హలీమా కోప్వే.. టాంజానియా దేశంలో యువతులు, గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల్లో రక్తహీనత నివారణ కోసం కృషి చేస్తోంది. ఇందుకోసం పాఠశాలలు, కళాశాలలో పౌష్టికాహార పంపిణీ చేపడుతోంది. రక్తదానం శిబిరాలు కూడా నిర్వహిస్తోంది. ఆసుపత్రులకు కావలసిన వైద్య సామగ్రి అందించేందుకు నిధులు సేకరిస్తోంది. ఇప్పటికే వేలాదిమంది మహిళలకు తను ఈ విధంగా సహాయ సహకారాలు అందించింది.

    హన్నా తుముకుండే, ఉగాండా

    హన్నా.. ఉగాండా దేశంలో యువతులు, స్త్రీలకు శానిటరీ నాప్ కీన్స్ పంపిణీ చేస్తోంది. రుతుక్రమం గురించి వారికి సలహాలు ఇస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తుంది. బాలికల్లో విద్య ఆవశ్యకతను వివరిస్తుంది. ఇప్పటికే వేలాదిమంది యువతులకు ఆమె నాప్ కీన్స్ పంపిణీ చేసింది.

    అచ్చే అబ్రహమ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగో

    అచ్చే అబ్రహమ్స్.. పేద ప్రజల్లో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఇన్విజబుల్ స్కార్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. వివిధ రకాల పాఠశాలల సందర్శించి వర్క్ షాప్స్ నిర్వహిస్తోంది. పిల్లలలో మానసిక ఎదుగుదల పెంపొందించే కార్యక్రమాలు చేపడుతోంది.