YCP Manifesto: అవే పథకాలు.. స్వల్ప మొత్తంలో పెంపు.. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో

నవరత్నాలను కొనసాగిస్తూనే.. అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పుడు కొనసాగుతున్న పోర్టులు, మౌలిక వసతులను మరింతగా విస్తరిస్తామని జగన్ చెప్పారు.

Written By: Dharma, Updated On : April 27, 2024 3:45 pm

YCP Manifesto

Follow us on

YCP Manifesto: వైసిపి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో పై మిశ్రమ స్పందన వస్తోంది. గత ఎన్నికలకు ముందు నవరత్నాల పేరిట జగన్ మేనిఫెస్టోను ప్రకటించారు. 9 అంశాలను చేర్చారు. అయితే అందులో మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ ప్రకటన, సిపిఎస్ రద్దు వంటి అంశాలు అమలుకు నోచుకోలేదు. అయితే మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను సైతం శత శాతం అమలు చేశామని వైసిపి చెబుతోంది. గత ఐదు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఈ తరుణంలో వైసిపి మ్యానిఫెస్టో పై అందరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం ఈసారి రెండు పేజీలతో.. 9 ముఖ్యాంశాలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించారు. ఇప్పుడున్న సంక్షేమ పథకాల మొత్తాన్ని స్వల్ప మొత్తం పెంచి.. ఈ మేనిఫెస్టోను వెల్లడించారు.

నవరత్నాలను కొనసాగిస్తూనే.. అభివృద్ధి, సుపరిపాలన అందిస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పుడు కొనసాగుతున్న పోర్టులు, మౌలిక వసతులను మరింతగా విస్తరిస్తామని జగన్ చెప్పారు. ఇప్పటివరకు వైయస్సార్ చేయూత పథకం కింద 75000 అందిస్తే.. వచ్చే ఐదేళ్ల కాలంలో 1.50 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. కాపు నేస్తం కింద అందించే మొత్తాన్ని లక్షా 20 వేలకు పెంచుతామని స్పష్టం చేశారు. అలాగే అమ్మఒడి పరిధి 15000 నుంచి 17000 పెంపునకు జగన్ హామీ ఇచ్చారు. వైయస్సార్ ఆసరా కింద 3 లక్షల వరకు సున్నా వడ్డీ ఇస్తామని ప్రకటించారు. ఈ బీసీ నేస్తం నాలుగు విడతల్లో 45 వేల నుంచి లక్ష ఐదు వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు.

అటు సామాజిక పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పిన జగన్.. ఇప్పుడు అందిస్తున్న మూడు వేల రూపాయల నుంచి 3,500 పెంచుతామని హామీ ఇచ్చారు. 2028, 2029 జనవరిలో రెండు విడతలుగా 500 మొత్తాన్ని పెంచుతామని వెల్లడించారు. 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నట్లు వివరించారు. వైయస్సార్ కళ్యాణమస్తు షాది తోఫా కొనసాగిస్తామని ప్రకటించారు. రైతు భరోసా కింద అందిస్తున్న 13,500ను 16 వేలకు పెంచుతామని.. ఈ ఐదేళ్ల కాలంలో 80 వేల రూపాయల సాగు ప్రోత్సాహం కింద అందిస్తామని జగన్ ప్రకటించారు. మిగతా పథకాలను యధావిధిగా కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే టిడిపి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతుకు సాగు ప్రోత్సాహం కింద 20 వేల నగదు, ఇంట్లో మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున నగదు, అమ్మ ఒడి కింద 20 వేల సాయం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి పథకాలు ప్రకటించిన నేపథ్యంలో.. వైసీపీ మేనిఫెస్టోలో భారీగా పథకాలు ఉంటాయని అంతా భావించారు. కానీ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే.. స్వల్ప మొత్తంలో పెంచనున్నట్లు జగన్ ప్రకటించారు. దీనిపై మిశ్రమ స్పందన మాత్రమే కనిపిస్తోంది.