Anna Canteen: అన్న క్యాంటీన్ లపై వైసీపీ నిందలు.. పేద ప్రజల కోపాన్ని తట్టుకోగలరా?

వైసిపివి వింత చేష్టలు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా పాలించారు. అధికారం పోయేసరికి బాధ్యతగా వ్యవహరించడం లేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలే కానీ.. ప్రజలకు ఉపయోగపడే పథకాలపై నిందలు వేస్తే మాత్రం ఆ పార్టీయే మూల్యం చెల్లించుకుంటుంది.

Written By: Dharma, Updated On : August 17, 2024 12:53 pm

Anna Canteen

Follow us on

Anna canteens : రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర దినోత్సవం నాడు 100 క్యాంటీన్లను ప్రారంభించారు. నిన్నటి నుంచి అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఉదయం టిఫిన్ తో పాటు మధ్యాహ్నం,రాత్రికి భోజనం అందించనున్నారు. రోజుకు 15 రూపాయలతో అన్నార్తులకు ఆహారం అందించే కార్యక్రమం కావడంతో అందరూ ఆహ్వానిస్తున్నారు.2014 నుంచి 2019 మధ్య అన్న క్యాంటీన్లు తెరవబడ్డాయి.అప్పట్లో ఈ క్యాంటీన్లు మెరుగైన సేవలు అందించేవి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లను నిలిపివేసింది. తాము తిరిగి అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 100 క్యాంటీన్లను ప్రారంభించారు.ఈ నెలాఖరుకు మిగిలిన క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. అయితే ఈ క్యాంటీన్ల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక వైసిపి విమర్శలకు దిగుతోంది. ఆహారంలో క్వాలిటీ లేదని.. మరొకటని ఇష్టం వచ్చినట్లుగా ఏదో ఒక బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. క్యాంటీన్ ప్రారంభంలో భాగంగా మంత్రి లోకేష్ అందరితో పాటు క్యూ లైన్ లో వచ్చి టిఫిన్ చేసారు. అయితే లోకేష్ అర ఇడ్లీ తిన్నారని.. చట్నీని రుచి చూడలేదని..ఇలా లేనిపోని ప్రచారాన్ని సోషల్ మీడియాలో కల్పిస్తున్నారు.అయితే వైసిపి చేస్తున్నది ప్రజల్లో విమర్శలకు కారణమవుతోంది. నగరాలు,పట్టణాల్లో చిరు వ్యాపారులు,చిరు ఉద్యోగులు,నిరుద్యోగ యువత,కార్మికులు..ఇలా అన్ని వర్గాలకు అన్న క్యాంటీన్లు ఆకలి తీర్చడం ఖాయం. గత ఐదేళ్లుగా ఈ క్యాంటీన్లను నిర్వీర్యం చేసింది వైసిపి ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తెరిచేసరికి తట్టుకోలేకపోతోంది. అక్కడి ఆహార పదార్థాలపై విమర్శలు చేస్తుండడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. అదంతా అబద్ధమని బాహాటంగానే చెబుతున్నారు.

* అక్షయపాత్రకు బాధ్యతలు
అన్న క్యాంటీన్లకు ఆహారం అందించే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ చూస్తోంది. ఇది హరే కృష్ణ మూమెంట్ కు చెందినది. ఈ సమస్త ఇప్పటికే అక్షయపాత్ర పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. ఈ సమస్త అన్న క్యాంటీన్ ల కోసం భారీ కిచెన్ ఏర్పాటు చేసింది. ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో అన్నం, కూరలు వండే విధానం ఉంటుంది. ప్యాకింగ్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. కానీ అదే సంస్థను తప్పుపడుతున్నారు వైసీపీ నేతలు.

* అక్కడకు వచ్చేది పేదలే
తమ వద్ద డబ్బులు ఉండి తినగలిగే స్తోమత ఉంటే ఎవ్వరూ అన్న క్యాంటీన్ లకు రారు. అక్కడకు వచ్చేది అన్నార్తులు మాత్రమే. నిరుపేదలు మాత్రమే. అలాంటి వారి కడుపు నింపడం పుణ్యం గా భావిస్తారు. కానీ అటువంటి వారి కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్ల పైనే నిందలు వేస్తున్నారు. రాజకీయాల కోసం ఒక మంచి కార్యక్రమమని చూడకుండా లేనిపోనివి ఆపాదిస్తున్నారు. గత ఐదేళ్లుగా అన్న క్యాంటీన్లను మూసివేసి అప్పఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఇప్పుడు దుష్ప్రచారం చేసి విమర్శల పాలవుతున్నారు.

* లోపాలను ఎత్తిచూపాలి
వైసిపి హయాంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అభివృద్ధి కంటే సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. అదే ప్రజల్లో నష్టానికి కారణమైంది. అయితే ఇప్పుడు నేరుగా పేద ప్రజలకు పట్టెడు అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించింది ప్రభుత్వం. ఇందులో లోపాలను వెతకాలి కానీ.. మొత్తం పథకమే లోపాలు అన్నట్లు వైసిపి వ్యవహరిస్తోంది. అది కచ్చితంగా ఆ పార్టీకి మైనస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.