YCP 11th List: వైసీపీ నుంచి మరో జాబితా విడుదలైంది. మూడు పేర్లతో సీఎం జగన్ 11 వ జాబితాను రిలీజ్ చేశారు. రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానానికి ఇన్చార్జిలను ప్రకటించారు. ఇప్పటివరకు వైసిపి 10 జాబితాలను ప్రకటించింది. దాదాపు 70 మంది వరకు సిట్టింగ్లను మార్చింది. మొన్నటికి మొన్న పార్టీ శ్రేణులతో సమావేశమైన జగన్ అభ్యర్థుల మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చారు. అయితే అటు తర్వాత రెండు జాబితాలను ప్రకటించడం విశేషం. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
తాజాగా ప్రకటించిన జాబితాలో.. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా బివై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ను నియమించారు. ఆయన స్థానంలో ఇటీవల చేరిన గొల్లపల్లి సూర్యారావును రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ జాబితాను విడుదల చేశారు. కర్నూలు పార్లమెంట్ స్థానం ఇన్చార్జిగా తొలుత మంత్రి గుమ్మనూరు జయరాం నియమించారు. అయితే అందుకు ఆయన విముఖత చూపారు. తిరిగి ఆలూరు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని పట్టుబట్టారు. జగన్ ఒప్పుకోకపోవడంతో టీడీపీలో చేరిపోయారు. గుంతకల్లు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గుమ్మనూరు జయరాం వెళ్లిపోవడంతో కర్నూలు పార్లమెంట్ స్థానానికి బివై రామయ్యకు ఇన్చార్జిగా ప్రకటించారు.
ఇటీవలే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు. ఆయన తెలుగుదేశం అభ్యర్థిత్వాన్ని ఆశించారు. దక్కకపోవడంతో వైసీపీలో చేరిపోయారు. 2004లో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైయస్సార్ క్యాబినెట్లో పనిచేశారు. 2014లో టిడిపిలో చేరారు. ఎన్నికల్లో టిడిపిలో చోటు దక్కకపోవడంతో వైసీపీలోకి ఫిరాయించారు. రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వరప్రసాద్ ను అమలాపురం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో రాజోలు అసెంబ్లీ స్థానాన్ని గొల్లపల్లి సూర్యారావు కేటాయించారు.
గత ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. కొద్దిరోజులకే ఆయన పార్టీ ఫిరాయించారు. వైసిపి మద్దతుదారుడుగా మారిపోయారు. వచ్చే ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ స్థానం తనకే దక్కుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ జగన్ ఆయనకు షాక్ ఇచ్చారు. అమలాపురం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు. దీంతో అయిష్టత గానే వరప్రసాద్ అమలాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాల్సి వస్తోంది. అయితే ఈ జగన్ ఈ 11 జాబితాలతో ఆపుతారో.. 12వ జాబితాను ప్రకటిస్తారో చూడాలి.