TDP BJP Alliance: చంద్రబాబు వ్యూహాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు పొత్తుల్లో బయటపడుతుంది అదే. అటు జనసేనకు టికెట్లు ఇచ్చినట్టే ఇచ్చి.. ఆ టికెట్లను టిడిపి నేతలకు కట్టబెడుతున్నారు. టిడిపిలోకి రావాల్సిన వల్లభనేని బాలశౌరి, కొణతాల రామకృష్ణ, కొత్తపల్లి సుబ్బరాయుడు వంటి నేతలను ఎంచక్కా జనసేనలోకి పంపి టికెట్లు ఇప్పించుకున్నారు. ఇప్పుడు బిజెపితో పొత్తుల చర్చలు జరుపుతున్నారు. ఈరోజు దీనిపై క్లారిటీ రానుంది. బిజెపి 10 అసెంబ్లీ 7 లోక్ సభ స్థానాలు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ టిడిపి మాత్రం ఆరు అసెంబ్లీ, నాలుగు లోక్ సభ సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. అందులో వాస్తవం ఉన్న ఆశ్చర్యపోనవసరం లేదు. జనసేన, బిజెపికి కలిపి 30 అసెంబ్లీ సీట్లు దాటకూడదన్నది చంద్రబాబు స్కెచ్.
అయితే పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు వదులుకోవాల్సి ఉన్నా చంద్రబాబు లెక్కచేయరు. ఎందుకంటే అసలు బిజెపిలో ఉన్నదే తనవారు. బిజెపికి సీట్లు కేటాయించినా పోటీ చేసేది వారే. అందుకే తెలుగుదేశం డైరెక్ట్ గా పోటీ చేసినా.. పొత్తులో భాగంగా పార్టీకి కేటాయించినా బరిలో నిలిచేది తనవారేనని చంద్రబాబుకు తెలుసు. ముందుగా ఎల్లో మీడియా ద్వారా పొత్తులో సింహభాగం ప్రయోజనాలు దక్కేలా కథనాలు రాసుకుంటారు. పొత్తును ఎలాగైనా కుదుర్చుకుంటారు. సీట్ల విషయంలో వీలైనంతవరకు నియంత్రణతో ముందుకు వెళ్తారు. అలా కేటాయించిన సీట్లలో సైతం తన వారినే నిలబెట్టి గెలిపించుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం.
బిజెపితో పొత్తు ఖరారు అవుతుందని చంద్రబాబుకు తెలుసు. ఏయే సీట్లు ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కి జమ్మలమడుగు, వరదాపురం సూరికి ధర్మవరం, కామినేని శ్రీనివాస్ కు కైకలూరు, విష్ణుకుమార్ రాజుకు విశాఖ నార్త్ తప్పకుండా కేటాయిస్తారు. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే బిజెపిలో ప్రో టిడిపి నేతలు అధికం. సుజనా చౌదరి, సత్య కుమార్, సీఎం రమేష్, దగ్గుపాటి పురందేశ్వరి, టీజీ వెంకటేష్ లకు తప్పకుండా ఎంపీ సీట్లు ఇస్తారు. వీళ్లంతా చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేసే వారన్న ఆరోపణలు ఉన్నాయి. పొత్తు కుదిరిన మరుక్షణం, రకరకాల విశ్లేషణలు, వ్యూహాల్లో భాగంగా వీరి టిక్కెట్లను చంద్రబాబు ఖరారు చేయిస్తారు. అందుకే పొత్తులో భాగంగా బిజెపికి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది ముఖ్యం కాదు.. అందులో ఎంతమంది ప్రోటీడీపీ నేతలు ఉంటారన్నదే గమనించాల్సిన విషయం.
అయితే చంద్రబాబు అభిప్రాయానికి కాదని బిజెపి కొంతమంది నేతలకు సీట్లు కేటాయించే అవకాశం ఉంది. సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు వంటివారికి అసెంబ్లీ, ఎంపీ టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారు. వీరిని టిడిపి శ్రేణులే ఓడిస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే వీరు టిడిపి వ్యతిరేక భావన కలిగిన వారు. పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలా పేరుకే బిజెపితో పొత్తు తప్ప.. ఆ పార్టీ తరఫున నిలబడే నేతల్లో 90 శాతం మంది టీడీపీ నాయకులే. ఈ లెక్కన చంద్రబాబు ప్లాను, వ్యూహం ఇట్టే తెలిసిపోతుంది.