Yanamala Rama Krishnudu: టిడిపిలో ఒక తరం నేతలు యాక్టివ్ రాజకీయాలకు దూరమవుతున్నారు. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి చాలామంది నేతలు కొనసాగుతూ వచ్చారు. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా పార్టీని మాత్రం వీడలేదు. అటువంటి నేతల్లో యనమల రామకృష్ణుడు (yanamala Ramakrishnudu) ఒకరు. 1982లో టిడిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబుతో( Chandrababu) మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. టిడిపి ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ. ముఖ్యంగా ఆర్థిక శాఖను ఆయనకే అప్పగించేవారు. ఎక్కువ కాలం ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించి రికార్డ్ సృష్టించారు. శాసనసభ స్పీకర్ గా కూడా సేవలందించారు. 8 పదుల వయసుకు దగ్గరవుతున్న ఆయన పొలిటికల్ కెరీర్ రిటైర్మెంట్ స్టేజ్ కు చేరుకున్నట్టే.
* మార్చితో ముగియనున్న పదవీకాలం
ప్రస్తుతం శాసనమండలి సభ్యుడుగా యనమల రామకృష్ణుడు( Rama krishnudu ) ఉన్నారు. ఆయన పదవీకాలం ఈ మార్చి 30 తో ముగియనుంది. దీంతో ఆయనకు మరోసారి రెన్యువల్ చేస్తారా? లేకుంటే రాజ్యసభ పదవి ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 2026లో పెద్దఎత్తున ఎమ్మెల్సీలు ఖాళీ అవుతాయి. రాజ్యసభ స్థానాలు సైతం టిడిపికి దక్కే అవకాశం ఉంది. అయితే పార్టీ సీనియర్ గా చంద్రబాబుకు ఎనలేని గౌరవం ఉన్నా.. కూటమి పార్టీలు ఉండడంతో ఇవ్వడం సాధ్యమవుతుందా? లేదా? అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే యనమల రామకృష్ణుడు సీనియారిటీకి, సిన్సియారిటీకి తగిన పదవి తప్పకుండా లభించే అవకాశం ఉందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
* వరుసగా గెలుపు
1983 నుంచి 1999 వరకు తుని అసెంబ్లీ( tuni Assembly Constituency) స్థానం నుంచి వరుసగా గెలుపొందుతూ వచ్చారు యనమల రామకృష్ణుడు. 2004 నుంచి మాత్రం ఆ కుటుంబానికి వరుసగా ఓటములు ఎదురయ్యాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు యనమల రామకృష్ణుడు. తన బదులు కుమార్తె దివ్య ను రంగంలోకి దించారు. ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. తాను మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతూ వచ్చారు. మరో రెండు నెలల్లో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే ఇటీవల రాజ్యసభ పదవుల విషయంలో ఆయన పేరు వినిపించింది. అదే సమయంలో ఆయన కాకినాడ పోర్టు గురించి సంచలన లేఖ రాశారు చంద్రబాబుకు. అక్కడ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. దీంతో రాజ్యసభ పదవి కోసమే యనమల రామకృష్ణుడు అలా అధినేతకు లేఖ రాసినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ఆ లేఖ తర్వాత హై కమాండ్ తో యనమలకు చిన్నపాటి గ్యాప్ ఏర్పడిందని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ హై కమాండ్ యనమల విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉంది. ఆయనకు ఎమ్మెల్సీ కానీ..రాజ్యసభ కానీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
* చంద్రబాబుకు అండగా
అయితే చంద్రబాబుకు( Chandrababu) అండగా నిలవడంలో యనమల రామకృష్ణుడు ముందుండేవారు. టిడిపి సంక్షోభ సమయంలో చంద్రబాబు వైపు నిలిచారు. పార్టీని నిలబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే పొలిటికల్ రిటైర్మెంట్ గౌరవప్రదంగా ఉండాలని యనమల భావిస్తున్నారు. ప్రధానంగా ఆయన రాజ్యసభ సీటును ఆశిస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ సీటీ ఇస్తే మాత్రం తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే మరో రెండు నెలల్లో ఆయన పదవీ విరమణ ఉండడంతో హై కమాండ్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. మరి అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ఎటువంటి అవకాశాలు ఇస్తారో? తెలియాల్సి ఉంది.