Gannavaram  Airport : గన్నవరానికి పెరిగిన విమాన ప్రయాణాలు.. విజయవాడలో దొరకని హోటల్స్ గదులు.. అమరావతి రాజధాని ఎఫెక్ట్

వైసిపి ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని భావించింది. అయితే అమలు చేయడంలో విఫలం అయింది. కూటమి ప్రభుత్వం రాకతో అమరావతికి కొత్త సందడి ప్రారంభమైంది. అదే సమయంలో విజయవాడ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.

Written By: Dharma, Updated On : August 27, 2024 2:28 pm

Gannavaram Airport

Follow us on

Gannavaram  Airport : ప్రభుత్వ ప్రాధాన్యతను బట్టి కొన్ని రంగాల్లో మార్పులు జరుగుతుంటాయి.ముఖ్యంగా పర్యాటక రంగంలో అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి ఆదాయం తో పాటు..ఉద్యోగ,ఉపాధి కల్పన పెరుగుతుంది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొన్ని రంగాల్లో ఘననీయమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీకి పర్యాటకుల తాకిడి పెరగడం విశేషం. విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిన్నా, పెద్ద హోటళ్ల వ్యాపారం గతంతో పోలిస్తే దాదాపు 20 నుంచి 30% వరకు పెరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకోవడంతోనే ఆతిధ్యరంగం అభివృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలతోనే ఇది సాధ్యమవుతుంది.దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులు, ప్రపంచ బ్యాంక్, ఏడిబి లాంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరచూ అమరావతికి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ కారణంగానే గన్నవరం ఎయిర్పోర్ట్ తో పాటు విజయవాడలోని పలు స్టార్ హోటళ్లు కళకళలాడుతున్నాయి.వ్యాపారాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

* 2014లో ఆ నిర్ణయంతో
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అప్పట్లో విజయవాడ తో పాటు గుంటూరుకు ప్రాధాన్యం పెరిగింది. విజయవాడకు చెందిన నోవాటెల్, పార్క్ హయత్ లాంటి హోటళ్లు కళకళలాడేవి. టాక్సీ డ్రైవర్లకు చేతినిండా పని లభించేది. అటు తర్వాత వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం, అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడంతో విజయవాడ కళ తప్పింది. అటు తరువాత కరోనా పుణ్యమా అని పర్యాటక రంగం కూడా దారుణంగా దెబ్బతింది. వైసిపి ప్రభుత్వ పాలసీ సైతం పర్యాటక శాఖను దెబ్బతీసింది.

* అమరావతికి రాకపోకలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 80 రోజులు అవుతోంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అమరావతికి రాకపోకలు ప్రారంభమయ్యాయి. పలు పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు తరచూ రాకపోకలు సాగిస్తుండడంతో.. విమాన ప్రయాణాలు పెరిగినట్లు గన్నవరం ఎయిర్పోర్ట్ గణాంకాలు చెబుతున్నాయి. గతం కంటే విమానంలో ప్రయాణించి ఏపీకి చేరుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది పర్యాటక రంగానికి శుభ సూచకమే.ఏప్రిల్ నెలలో 89 వేల నాలుగు వందల మంది ప్రయాణించగా.. నీలో ఆ సంఖ్య 95 వేలకు చేరింది.. జూన్ నాటికి లక్ష దాటింది. జూలైలో అయితే లక్ష 7వేల మంది రాకపోకలు సాగించినట్లు తెలిసింది. గత ఐదేళ్లలో రోజుకు 2500 మందికి తక్కువ కాకుండా ప్రయాణిస్తే.. ఇప్పుడు మాత్రం రోజుకు 3,500 మందికి తక్కువ కాకుండా ప్రయాణాలు చేస్తుండడం విశేషం.

* విజయవాడ హోటల్స్ ఫుల్
విజయవాడలో హోటళ్లలో ఉండే వారి సంఖ్య కూడా పెరిగింది. విజయవాడ పరిధిలోని పెద్ద హోటల్స్ లో రెండు వేలకు పైగా గదులు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో వీటి ఆక్యుపెన్సివ్ 50% లోపలే. కానీ ఇప్పుడు 80 శాతానికి పైగా దాటుతోంది. వీకెండ్ లో అయితే 90 శాతం దాటేస్తుంది. ప్రత్యేక దినాల్లో హోటల్స్ రూములు కూడా దొరకడం కష్టతరంగా మారింది. పూర్తిస్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైతే విజయవాడకు పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశాలు అధికం. అందుకే దేశంలో పేరు పొందిన మారియట్, రాడిసన్ గ్రూపులు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో తమ ప్రాజెక్టులను తీసుకురావడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.