Kadapa Garbage : కడపలో ప్రజాగ్రహం.. చెత్తతో నిండిపోయిన వైసీపీ మేయర్ గృహం!

ప్రభుత్వ ఆదేశాలను స్థానిక సంస్థలు పాటించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కాదని.. తానే సొంతంగా ఆదేశాలు ఇచ్చారు కడప వైసీపీ మేయర్. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. దాడి చేసినంత ప్రయత్నం చేశారు.

Written By: Dharma, Updated On : August 27, 2024 2:42 pm

Kadapa Garbage issue

Follow us on

Kadapa Garbage  : ఏపీలో వైసీపీ దారుణ పరాజయానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, చెత్త పన్ను వంటివి వైసీపీ సర్కార్ పై వ్యతిరేకతను పెంచాయి. ప్రజల్లో సైతం ఈ రెండు అంశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. అది ఓట్ల రూపంలో ఈ ఎన్నికల్లో ప్రభావం చూపింది. సహజంగానే ప్రజా వ్యతిరేక అంశాలు కావడంతో కూటమి ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు చెత్త పన్నును రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్నును నిలిపివేసింది. అయినా చెత్త పన్ను చెల్లించాల్సిందేనంటూ కడప మేయర్ సురేష్ బాబు జారీ చేసిన ఆదేశాలు కలకలం రేపాయి. ఈ ఆదేశాలపై కడప నగర ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. తమ ఇంట్లో ఉన్న చెత్తను తీసుకొచ్చి మేయర్ ఇంట్లో పారేశారు. దీంతో ఇది ఉద్రిక్తతకు దారితీసింది. ఇటీవల ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. కడప జిల్లాలో సైతం కేవలం మూడు స్థానాలకు పరిమితం అయ్యింది. కడప జిల్లా ప్రజల సైతం వైసీపీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఇప్పుడు అదే వైసీపీకి చెందిన మేయర్ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెత్త పన్ను నిర్ణయాన్ని కొనసాగించారు. ఇదే ప్రజల్లో ఆగ్రహానికి కారణమైంది. ఈరోజు వందలాదిమంది కడప నగరవాసులు వచ్చి మేయర్ ఇంట్లో చెత్త పారబోయడం కలకలం రేపింది.

* చెత్త పన్ను రద్దు
చెత్త పన్నును రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక సంస్థల పరిధిలో చెత్త పన్ను వసూళ్లను నిలుపువేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చెత్త పన్ను వసూలు ప్రక్రియ నిలిచిపోయింది. కానీ కడపలో మాత్రం మేయర్ సురేష్ బాబు స్థానికంగా చెత్త పన్ను చెల్లించాల్సిందేనని పట్టు పట్టారు. పన్ను చెల్లించకపోతే ఇళ్ళ నుంచి చెత్త సేకరణ చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. ప్రజల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.

*రాజకీయ ఆధిపత్యంతోనే
కడప అసెంబ్లీ స్థానాన్ని సైతం టిడిపి కైవసం చేసుకుంది. వైసీపీకి చెందిన డిప్యూటీ సీఎం పైనే మాధవి రెడ్డి పోటీ చేశారు. ఎన్నికల్లో గెలిచారు. అయితే రాజకీయ ఆధిపత్యం లో భాగంగానే కడప మేయర్ ఇలా వ్యవహరించారని తెలుస్తోంది. దీనిని తీవ్రంగా తప్పుపట్టారు ఎమ్మెల్యే మాధవి రెడ్డి. చెత్త పన్ను చెల్లించవద్దని ప్రజలను ఆమె కోరారు. దీంతో స్థానికులు చెత్త పన్ను చెల్లించడం మానేశారు. అదే సమయంలో మేయర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది చెత్త సేకరణను నిలిపివేశారు. దీంతో నగరం వ్యాప్తంగా చెత్త పేరుకుపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురైన జనం అదే చెత్తను తీసుకెళ్లి మేయర్ ఇంట్లో పారబోశారు.

* ప్రభుత్వం సీరియస్
కడప నగరపాలక సంస్థలో చెత్త సేకరణ విషయం వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపై ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ కు దిగే అవకాశం ఉంది. మరోవైపు మేయర్ సొంతంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే కీలక కార్పొరేషన్లు టిడిపి వశం అవుతున్నాయి. ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం కడప కార్పొరేషన్ పై ఫోకస్ పెడితే.. వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. మేయర్ సురేష్ కుమార్ ఇంకా వైసీపీ ప్రభుత్వం కొనసాగుతుందన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. మున్ముందు ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. మేయర్ పీఠం నుంచి దించేందుకు టిడిపి పావులు కదపనున్నట్లు తెలుస్తోంది.