Nellore Politics: చంద్రబాబు ప్రకటించిన ఎంపీ వైసీపీలోకా? అయితే షాకే?

వైసీపీ ఆవిర్భావం నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ వెంట అడుగులేస్తూ వచ్చారు. గత రెండు ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అందుకే జగన్ ఆయనకు రాజ్యసభ చాన్స్ ఇచ్చారు.

Written By: Dharma, Updated On : April 6, 2024 3:15 pm

Nellore Politics

Follow us on

Nellore Politics: నెల్లూరు రాజకీయాల్లో సంచలనం నమోదు కానుందా? టిడిపిలోకి వెళ్లిన నేతలు తిరిగి వైసీపీలోకి రానున్నారా? అక్కడ ఇమడలేక పోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రధానంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు యూటర్న్ తీసుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నామినేషన్లు దాఖలు చేసే సమయానికి వారు వైసీపీలోకి తిరుగు ముఖం పట్టనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే నెల్లూరు రాజకీయాల్లో సమీకరణలు శరవేగంగా మారనున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కొద్ది రోజుల కిందటే వారు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి జగన్ వెంట అడుగులేస్తూ వచ్చారు. గత రెండు ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అందుకే జగన్ ఆయనకు రాజ్యసభ చాన్స్ ఇచ్చారు. అయితే ఇటీవల నెల్లూరు జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేంరెడ్డి దంపతులు వైసీపీని వీడారు. ముఖ్యంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీరుతోనే వారు పార్టీకి దూరమైనట్లు తెలుస్తోంది. పార్టీకి అన్ని విధాలుగా అండగా నిలిచే వేమిరెడ్డి కంటే.. అనిల్ కుమార్ యాదవ్ కు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ దంపతులు నొచ్చుకున్నారు. మృదుస్వభావం కలిగిన వారు క్షణికావేశంతో పార్టీకి దూరమయ్యారు. అయితే వారి పట్ల వైసీపీ శ్రేణులు ఇప్పటికీ సానుభూతిగా ఉన్నాయి. వాస్తవానికి వైసిపి నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి పేరును ఎప్పుడో ఖరారు చేశారు. కానీ నెల్లూరు సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా తన భార్య ప్రశాంతి రెడ్డి పేరును పరిశీలించాలని ప్రభాకర్ రెడ్డి కోరారు.కానీ అనూహ్యంగా డిప్యూటీ మేయర్ ఖలీల్ పేరును జగన్ ఖరారు చేశారు. ఖలీల్ అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు. ఈ సీటు విషయంలో అనిల్ తాను అనుకున్నది సాధించుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిని అయిన తనను కనీసం సంప్రదించకుండా.. ఖలీల్ పేరును ఖరారు చేయడాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు.

అయితే అప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో వేంరెడ్డి చూపు తెలుగుదేశం వైపు పడింది. అటు తెలుగుదేశం నుంచి కూడా మంచి ఆఫర్ వచ్చింది. వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు పార్లమెంట్ సీటు, ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు సీటును చంద్రబాబు కేటాయించారు. ప్రస్తుతం ఆ దంపతులు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు తిరిగి వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పేరును ప్రకటించారు. కానీ నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యే నాటికి వేంరెడ్డి దంపతులు తిరిగి వైసిపిలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అటువంటిదేమీ లేదని.. ఇది వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని వేంరెడ్డి అనుచరులు కొట్టి పారేస్తున్నారు. వైసిపి వర్గాల్లో మాత్రం ఇదో చర్చగా మారింది. అయితే రాజకీయాల్లో ఈ తరహా మైండ్ గేమ్ సహజం. అయితే వైసిపి భావజాలాన్ని ఇష్టపడే వేంరెడ్డి లాంటి వారి విషయంలో ఈ ప్రచారం జరుగుతుండడం సరికొత్తగా ఉంది. మరి ఇది ఎటువంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.