Duvvada Srinivas: వైసీపీ సస్పెన్షన్ నేత దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) మళ్ళీ హల్చల్ చేస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఇంతతవరకు గెలిచిన దాఖలాలు లేవు. దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ కింజరాపు ఫ్యామిలీ చేతుల్లో ఆయనకు ఓటమి తప్పడం లేదు. కానీ 2029 ఎన్నికల్లో మాత్రం కింజరాపు ఫ్యామిలీని ఓడిస్తానని మాత్రం చెబుతున్నారు. ఈ విషయంలో గట్టిగానే సవాల్ విసురుతున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఈ విషయంలో అరచి గోల చేశారు. టెక్కలి అసెంబ్లీ ఎన్నికల్లో కింజరాపు అచ్చెనాయుడును ఓడించి తీరుతానని శపధం చేశారు అయితే ఇలా ఆయన చాలాసార్లు శపధం చేశారు కానీ.. ఒక్కసారి కూడా నెగ్గలేకపోయారు. చివరకు కింజరాపు వారి గ్రామం నిమ్మాడ వెళ్లి మరి సౌండ్ చేశారు. కనీసం ఒక్క వార్డులో కూడా తన వారిని గెలిపించుకోలేకపోయారు.
* ఎప్పుడూ ఓటమే
పూర్వపు హరిశ్చంద్ర పురం, నేటి టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దువ్వాడ శ్రీనివాస్ తో పాటు ఆయన కుటుంబం కింజరాపు ఫ్యామిలీ చేతుల్లో ఓడిపోయింది. 2004లో దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు హరిశ్చంద్ర పురం నియోజకవర్గం నుంచి కానీ కింజరాపు అచ్చెనాయుడు చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గాల పునర్విభజనతో టెక్కలి నుంచి పోటీ చేసేది కింజరాపు కుటుంబం. 2014లో వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఎంపీ అభ్యర్థిగా కింజరాపు ఫ్యామిలీ పై పోటీ చేసి ఓడిపోయారు దువ్వాడ శ్రీనివాస్. మొన్నటి ఎన్నికల్లో మళ్లీ అదే ఫ్యామిలీ పై టెక్కలి అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు దువ్వాడ శ్రీనివాస్. ఎన్నిసార్లు ఓటమి ఎదురైనా ఇంకా ఆయనలో ఆశ చావలేదు. ఇంకా శపధాలు చేస్తూనే ఉన్నారు. అయితే 2029 ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానో చెప్పలేదు దువ్వాడ శ్రీనివాస్. ఆయన మళ్లీ వైసీపీలోకి వచ్చి పోటీ చేస్తారు అనేవారు ఉన్నారు. అదే ఆశాభావంతో ఉన్నారు. కానీ ధర్మాన బ్రదర్స్ ఉండగా అది వర్కౌట్ కాదు కూడా. ఎందుకంటే అదే ధర్మాన బ్రదర్స్ తో సైతం దువ్వాడ శ్రీనివాస్ గొడవలు పెట్టుకుంటున్నారు.
* పంచాయతీ ఎన్నికల సమయంలో..
2021లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 120 పంచాయితీలను వైసీపీ సొంతం చేసుకో నేలా దువ్వాడ శ్రీనివాస్ సక్సెస్ అయ్యారు. కింజరాపు కుటుంబం సొంత గ్రామం నిమ్మాడ వెళ్లి ఆ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఒక అభ్యర్థిని పెట్టారు. ఓపెన్ టాప్ జీప్ పై వెళ్లి.. తొడగొట్టారు. కింజరాపు అప్పన్న అనే వ్యక్తితో నామినేషన్ వేయించారు. అక్కడ గెలిచి తీరుతానని శపధం చేశారు. అప్పటికే సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్లు వైసీపీకి అండగా ఉన్నారు. కానీ ఆ ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా ఓట్లు తెచ్చుకోలేదు దువ్వాడ ప్రతిపాదించిన కింజరాపు అప్పన్న. అయితే ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి బాలేదు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు, జగన్మోహన్ రెడ్డిని ఆకర్షించేందుకు మాత్రమే ఇలాంటి శపధాలు చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చి నడుస్తోంది . మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకిస్తున్న ధర్మాన ప్రసాదరావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారని ప్రచారం నడుస్తోంది. తాడేపల్లి కేంద్ర కార్యాలయ బాధ్యతలు తీసుకుంటారని కూడా టాక్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ లేకపోతే తనకు కష్టమని దువ్వాడ శ్రీనివాస్ కు తెలుసు. అందుకే ఇటువంటి శపధాలు చేస్తున్నారని వైసిపి వర్గాల్లో ప్రచారం ఉంది.