Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం పవన్ పై పోటీ చేస్తారా? పోటీ చేసి గెలవగలరా? ఆ స్థాయి మద్దతు కాపుల్లో ఆయనకు ఉందా? మరి ఎందుకు వైసిపి తహతహలాడుతోంది? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వస్తానంటే జనసేన పొమ్మంది. అటువంటి ముద్రగడ కోసం వైసిపి ఆరాటపడుతుండడం సొంత పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. ముద్రగడకు రాజకీయ స్థిరత్వం తక్కువ. గతంలో తెలుగుదేశం పార్టీలో ముద్రగడ కీలక పదవులు అనుభవించారు. ఆ పార్టీని విభేదించి కాంగ్రెస్ లోకి వచ్చారు. మరికొన్నాళ్లు రాజకీయంగా సైలెంట్ అయ్యారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు.
గత ఎన్నికలకు ముందు, తరువాత వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న అపవాదును ముద్రగడ మూట కట్టుకున్నారు. ఎన్నికల అనంతరం వైసీపీలో చేరతారని అంతా భావించారు. కానీ అలా చేయలేదు. మొన్నటి వరకు వైసిపి కి అనుకూలంగానే వ్యవహరించారు. సీట్ల సర్దుబాటులో తమ కుటుంబానికి న్యాయం జరగలేదని అదే వైసీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. తీవ్ర ఆక్రోషం వెళ్ళగక్కారు ఇంతలో జనసేన నేతలు రావడంతో వారికి భోజనాలు పెట్టి మరి చర్చలు జరిపారు. ఆయన కుమారుడు ఏకంగా జనసేనలో కానీ, టిడిపిలో కానీ చేరతామని ప్రకటించారు. వైసీపీలో చేరే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.కానీ ముద్రగడను టిడిపి, జనసేన పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వైసీపీ ఆహ్వానించడం మాత్రం ఆ పార్టీ శ్రేణులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు.
ముద్రగడతో కొత్తగా వచ్చేది ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయనకు కాపు పెద్దల్లోనే మాత్రమే ఫాలోయింగ్ ఉంది. కాపు సామాజిక వర్గంలో మెజారిటీ వర్గం, యువత పవన్ వెంట ఉన్నారు. ముద్రగడతో కొత్తగా వచ్చేదేమీ లేదు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవడం వల్ల ఇతర కులాలు ఆలోచనలు చేసే అవకాశం ఉంది. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించడం ఏమంత శ్రేయస్కరం కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ పై పిఠాపురంలో ముద్రగడ పోటీ చేస్తే లాభం ఉంటుందా? లేదా? అన్నది వైసిపి హై కమాండ్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం పవన్ పై పోటీకే ముద్రగడను తీసుకుంటే అంతకంటే మూల్యం మరొకటి ఉండదు.