Jagan: జగన్ ను తప్పుదోవ పట్టించిందెవరు

Jagan: వైసీపీకి గత ఎన్నికల్లో అంతులేని విజయం లభించడం వెనుక ఐప్యాక్ పాత్ర ఉందన్నది జగమెరిగిన సత్యం. 2019 ఎన్నికల్లో విజయానికి కారణమైన ఐప్యాక్..

Written By: Dharma, Updated On : June 24, 2024 10:37 am

Who misled Jagan

Follow us on

Jagan: ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం పాలైంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అంతులేని విజయంతో యావత్ దేశం ఏపీ వైపు చూసింది. ఇప్పుడు అదే స్థాయిలో ఓటమి ఎదురు కావడంతో దేశమే ఆశ్చర్యపోయింది. చివరికి ప్రత్యర్థిగా ఉన్న కూటమి నేతలు సైతం ఊహించని విజయం సొంతమయ్యింది. ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే గుణపాఠాలు నేర్చుకుంటున్న వైసిపి అసలు తప్పు ఎక్కడ జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. తొలుత ఈవీఎంలపై అనుమానంతో ప్రారంభమైన వైసిపి నేతల ఆలోచన.. అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అన్నదానిపై సమీక్షించుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మూడు పార్టీలు కలిసి ప్రభంజనం సృష్టించాయని ఒకరు, మద్యం పాలసీ ముంచిందని మరొకరు, ఇసుక విధానంతోనే అల్లరి పాలయ్యామని ఇంకొకరు, నోటి దూల నేతలతోనే ఈ పరిస్థితి వచ్చిందని చాలామంది వైసీపీ నేతలు విశ్లేషించడం ప్రారంభించారు.

వైసీపీకి గత ఎన్నికల్లో అంతులేని విజయం లభించడం వెనుక ఐప్యాక్ పాత్ర ఉందన్నది జగమెరిగిన సత్యం. 2019 ఎన్నికల్లో విజయానికి కారణమైన ఐప్యాక్.. 2024 ఎన్నికల్లో మాత్రం వైసీపీని ముంచేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది రాజకీయ వ్యూహ బృందం. కానీ దానికి మించి బాధ్యతలు అప్పగించారు జగన్. వారు ఇచ్చిందే నివేదిక, వారు చెప్పిన వారే అభ్యర్థి. చివరకు ఏ గ్రామానికి, ఏ మార్గానికి రహదారి వేస్తే ఓట్లు వస్తాయో కూడా వాళ్లే చెప్పారు. సొంత పార్టీ నేతలను నిత్యం వాచ్ చేశారు. గడపగడపకు మన ప్రభుత్వంలో సైతం వారిదే క్రియాశీలక పాత్ర. ఏ మాత్రం ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ప్రతికూలతగా మార్చి నివేదిక ఇచ్చేవారు. వారిచ్చిన నివేదికలతోనే ఏకపక్షంగా 80 చోట్ల అభ్యర్థులను మార్చారు జగన్. దాని పర్యవసానమే ఈ ఘోర ఓటమి అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఎవరైనా తమ కష్టసుఖాలను సొంత పార్టీ నేతలతో పంచుకుంటారు. వారితోనే వ్యూహాలు అమలు చేస్తారు. ప్రజానాడిని పసిగడతారు. ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటారు. కానీ జగన్ మాత్రం ఐపాక్ టీం లో అంత పెట్టేశారు. నేను బట్టన్ నొక్కుతాను. ఐపాక్ టీం వ్యూహాలు చూస్తుంది. మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని పురమాయించారే తప్ప.. వాస్తవ పరిస్థితిని గ్రహించలేకపోయారు.

Also Read: YS Jagan vs Chandrababu : జగన్ కు గట్టి షాక్ ఇచ్చిన చంద్రబాబు

నాకు ఎంపీగా పోటీ చేయాలని ఉంది. కానీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కనీసం నా వెర్షన్ వినేందుకు సమయం ఇవ్వలేదు. సీఎం అప్పాయింట్మెంట్ కూడా లభించలేదు. పోలింగ్ అనంతరం డిప్యూటీ సీఎం గా ఉన్న పీడిక రాజన్న దొర వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ఒక డిప్యూటీ సీఎం గా ఉన్న నేతకే ఈ పరిస్థితి ఉంటే సామాన్య ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ నలుగురు తప్ప మరెవరు జగన్ ను నేరుగా కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే సీఎమ్ఓ ధనుంజయ రెడ్డికి వివరించాలని సూచించేవారు. ఎన్నో ద్వారాలు దాటితే కానీ ముఖ్యమంత్రి జగన్ వద్దకు చేరే పరిస్థితి కూడా గత ఐదేళ్లలో లేదు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి, లేకుంటే ధనుంజయ రెడ్డి, మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారికి తమ వెర్షన్ వినిపించుకోవాలి. నియోజకవర్గంలో బాధలు, రాజకీయ సమీకరణలు వారితో చెప్పుకుంటే.. అవి సీఎం వద్దకు వెళ్లేవో.. వెళ్లకపోయావో తెలియని పరిస్థితి.

మద్యం పాలసీ తో ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? అసలు వైసీపీ మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి? చేసింది ఏంటి? ప్రభుత్వ మద్యం దుకాణాలు నడపడం వల్ల ఆదాయం పెరిగిందా? అయితే ఎవరికి పెరిగింది? ప్రభుత్వానికా? ప్రభుత్వ పెద్దలకా? పోనీ మద్య నిషేధం అమలు చేశారా? కనీసం మంచి బ్రాండ్ మద్యం అందించారా? ధర తగ్గించారా? ఈమధ్యం షాపుల నిర్వహణలో సామాన్య వైసీపీ కార్యకర్త, నాయకుడికి చోటిచ్చారా? అంటే సమాధానం దొరకని పరిస్థితి. కేవలం ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆ నలుగురే మద్యం విధానంతో బాగుపడ్డారు. మిగతావారు సమిధలుగా మారారు. పోనీ మద్యం బాబులకి ఏమైనా మంచి జరిగిందా? అంటే అది కూడా లేదు. ఇసుక విధానంలోనూ అదే పరిస్థితి. ఎక్కడ నాయకుడు, కార్యకర్తకు చోటు లేదు. కేవలం పెద్ద తలకాయలకి ఇసుక విధానం లబ్ధి చేకూర్చుంది.

Also Read: Tirumala darshan : నేడు తిరుమల దర్శన టికెట్లు విడుదల.. ఎలా బుక్ చేసుకోవాలంటే?

ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఆ నలుగురిదే పెత్తనం. సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి.. ఇలా తనకు అస్మదీయులైన ఈ ఐదుగురితోనే పాలన సాగించారు జగన్. క్షేత్రస్థాయిలో అంత సవ్యంగా జరిగిపోతున్నట్లు భావించారు. కానీ వాస్తవాలు జగన్ వరకు వెళ్లలేదు. అతను నమ్ముకున్న ఐపాక్ టీం చెప్పలేదు. కోటరీగా భావిస్తున్న ఆ నలుగురైదుగురు కూడా వాస్తవాలు వివరించలేదు. అందరూ కలిసి వైసిపి ఓటమికి కారణమయ్యారు. అయితే అంతులేని విజయానికి కారణం తానేనని భావించే జగన్.. ఓటమికి కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఓటమి నుంచి గుణ పాఠాలు నేర్వాల్సిన సమయం ఇది.