YS Jagan vs Chandrababu : చంద్రబాబు సర్కార్ జగన్ కు వరుస షాక్ లు ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యాలయాల నిర్మాణం నిబంధనలకు విరుద్ధమంటూ నోటీసులు ఇస్తోంది. ఎప్పటికీ అమరావతిలోని వైసిపి కేంద్ర కార్యాలయ భవనాన్ని నేలమట్టం చేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మితమవుతున్న వైసిపి కార్యాలయాలకు నోటీసులు అందాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని.. వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లి తో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని అధికారులు ఆదేశించారు.
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున భూములను కేటాయించారు. ఎక్కడపడితే అక్కడ ప్యాలెస్ ల తరహాలో పార్టీ కార్యాలయాలను కట్టారు. వాటిలో కొన్ని పూర్తికాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఇటీవల వైసిపి ఓడిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై ఉక్కుపాదం మోపే పనిలో ప్రస్తుత ప్రభుత్వం పడింది.మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అన్ని రంగులతో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. అయితే వైసిపి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పార్టీ కార్యాలయాలు నిర్మించినట్లు విచారణలో తేలింది. అందుకే వరుసగా నోటీసులు అందిస్తున్నారు.
ఎప్పటికీ అమరావతిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ భవన నిర్మాణ పనులను ధ్వంసం చేశారు. వారం రోజుల కిందటే సీఆర్డీఏ అధికారులు వైసీపీ నేతలకు నోటీసులు అందించారు. వాటికి సమాధానం చెప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించే పనిలో పడ్డారు వైసిపి నేతలు. ఈ నేపథ్యంలో వేకువ జాము సమయంలో యంత్రాలతో వెళ్లి ఆ నిర్మాణాలను తొలగించారు. దీనిపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఐదేళ్ల పాలన ఎలా ఉంటుందో సంకేతాలు పంపించారని తప్పుపట్టారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయ భవనాలకు నోటీసులు అందజేయడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. దీనిపై వైసీపీ న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.