AP BJP: ఏపీలో బిజెపికి అభ్యర్థులు దొరకడం లేదా? లేకుంటే పోటీ ఎక్కువై అభ్యర్థులను ఖరారు చేయడం లేదా? పొత్తులు, సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయింది. కానీ ఇంతవరకు బిజెపి అభ్యర్థులను ప్రకటించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పొత్తులో భాగంగా బిజెపి 10 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది. కానీ ఇది జరిగి రోజులు గడుస్తున్నా అభ్యర్థులను ఖరారు చేసుకోవడంలో మాత్రం జాప్యం జరుగుతోంది.బిజెపి తీరుతో మిగతా భాగస్వామ్య పక్షాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని సీట్ల విషయంలో టిడిపి, జనసేన ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. పెండింగ్లో పెట్టడంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు అసంతృప్తి చెందుతున్నాయి. అక్కడ వైసిపి పట్టు బిగిస్తుండడంతో ఆందోళన చెందుతున్నాయి.
బిజెపి 16 మంది అభ్యర్థులను ఖరారు చేయలేకపోతోంది.అయితే దీనికి కారణాలు ఉన్నాయి. బిజెపిలో ప్రోటీడిపి, ప్రో వైసిపి నేతలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని వైసిపి అనుకూల నేతలు చివరి వరకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ విషయంలో విఫలమయ్యారు. అయితే ఇటువంటి నాయకులకు ఇప్పుడు టిక్కెట్లు దక్కేలా లేవు. అందుకే వీరు చికాకు పెడుతున్నారు. హై కమాండ్ కు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై ఈ ప్రభావం పడుతుంది. రోజురోజుకు జఠిలంగా మారుతోంది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల పోటీ విషయంలో చాలా మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి గట్టి అభ్యర్థులు దొరకడం లేదు. దీంతో అభ్యర్థులను బిజెపి ఖరారు చేయలేకపోతోంది.
పొత్తులో భాగంగా బిజెపికి అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి లోక్సభ స్థానాలు దక్కాయి. అయితే ఇవి బిజెపికి అంతా ఆమోదయోగ్యమైనవి కావని.. తెలుగుదేశం బలహీనంగా ఉన్న సీట్లనే కేటాయించిందని ప్రోవైసిపీ నేతలు హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఇది కూడా జాప్యానికి ఒక కారణం. మరోవైపు జనసేనకు కేటాయించిన సీట్లను సైతం బిజెపి అడుగుతోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వంటి వాటిని పట్టుబడుతోంది. దీంతో ఇదో సమస్యగా మారింది. తెలుగుదేశం పార్టీ ఇంకా ఐదు అసెంబ్లీ స్థానాలు, నాలుగు పార్లమెంట్ స్థానాలను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. బిజెపి కొన్ని స్థానాల విషయంలో పట్టుబడుతుండడమే అందుకు కారణం. మొత్తానికైతే కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తానని చెబుతున్న బిజెపి.. తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేకపోవడం విమర్శలకు తావిస్తోంది.