Pawankalyan : కుండబద్దలు కొట్టి మాట్లాడడం పవన్ నైజం. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టే బాహటంగానే వ్యక్తపరుస్తారు. ఇది చాలా సందర్భాల్లో చూశాం. తాను చెప్పాలనుకున్నది స్ట్రయిట్ గానే చెబుతారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఎలా మాట్లాడతారన్నదే ప్రశ్న. పేరుకే బీజేపీ మిత్రపక్షమని.. ఆ పార్టీ సహకరించి ఉంటే మరో పార్టీతో పొత్తు అన్న ప్రశ్న ఉండేది కాదని పవన్ తన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే బీజేపీ ఆశించిన స్థాయిలో తనకు సహకరించలేదనదే పవన్ బాధ. ఇప్పుడు ఢిల్లీ వేదికగా ఇదే మాట చెబుతారా? అన్న చర్చ నడుస్తోంది.
జనసేన బీజేపీకి భాగస్వామ్య పక్షం. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ నడుస్తుంది కనుకు బీజేపీ దాని పక్షమే. అయితే ఈ నాలుగేళ్లలో పవన్ ఎన్డీఏ పక్షమని బీజేపీ ఎన్నడూ గుర్తించలేదు. ఎప్పుడూ ఆహ్వానించనూ లేదు. ఇప్పుడు ఉన్నపళంగా పిలిచేసరికి జనసైనికుల్లో ఓ రకమైన అంతర్మథనం ప్రారంభమైంది. తొలుత వెళ్లాలా వద్దా ఆలోచించిన పవన్.. పెద్దవారు పిలిచారు కాబట్టి వెళ్లడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చారు. ఒక రోజు ముందే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే పవన్ పెద్దల మాటలను సావధానంగా వింటారా? లేకుంటే తాను చెప్పాలనుకున్నది అక్కడే తేల్చేస్తారా? అన్నది చూడాలి.
అయితే తనకు రూట్ మ్యాప్ ఇవ్వకుండా బీజేపీ జాప్యం చేసిందని బాహటంగానే తన బాధను వ్యక్తం చేశారు. నిజమే.. పవన్ ను కలుపుకెళ్లిన సందర్భం చాలా తక్కువ. రకరకాల ఇక్వేషన్స్ తో రహస్య మిత్రుడు జగన్ కోసం పవన్ ను నియంత్రించిన సందర్భాలున్నాయి. దీనిపై పవన్ ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు అధికం. బీజేపీని బలోపేతం చేసుకోలేకపోయారు. నమ్మదగిన స్నేహితుడిగా ఉన్న పవన్ కు చేయి అందించలేకపోయారు. ఇప్పుడు ఢిల్లీ పిలిచి హితోపదేశాలు చేస్తే అందరిలా తల ఊపే తత్వం పవన్ ది కాదు.
ఢిల్లీలో అడుగుపెట్టిన పవన్ పాజిటివ్ గా ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల గురించి చర్చిస్తానని చెప్పారు. అన్నింటికీ మించి ఏపీ గురించి ప్రస్తావిస్తానని చెప్పారు. అయితే ఇందులో రెండురకాల జవాబులు ఉన్నాయి. నాలుగేళ్ల బీజేపీ వైఖరిని ప్రస్తావిస్తూనే.. భవిష్యత్ కార్యాచరణ ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కచ్చితంగా జగన్ సర్కారు చేస్తున్న దురాగతాలను వివరిస్తారు. వైసీపీ విషయంలో బీజేపీ స్టాండ్ ఏమిటన్న విషయంపై స్పష్టత కోరుతారు. వీటిన్నింటిపై కులంకుషంగా చర్చించి.. ఢిల్లీ వేదికగా కీలక ప్రకటన చేస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.