YCP Vs Pawankalyan : సాధారణంగా అధికార, ప్రధాన ప్రతిపక్షం మధ్య రాజకీయ యుద్ధం జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిపక్షం జాడలేదు. కేవలం వైసీపీ, జనసేన మధ్య మాత్రమే రాజకీయ వైరం కొనసాగుతోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ జాడలేదు.జగన్, పవన్ అన్నట్టుంది పరిస్థితి. వారిద్దరి మధ్య పెద్దల మాటల యుద్ధమే నడుస్తోంది. అసలు పవన్ ని ఒక నాయకుడిగా, జనసేనను ఒక పార్టీగా చూడని వైసీపీ బ్యాచ్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. పవన్ రూపంలో బలమైన గొంతుక ఇబ్బందిపెడుతుండడంతో స్పందిస్తున్నారు. జనసేనను, పవన్ ను ఆడిపోసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనసేన గ్రాఫ్ ను పెంచుతున్నారు.
జనసేనకు మీడియా సపోర్టు అంతంతమాత్రమే. పార్టీ ఆవిర్భావం నుంచి మీడియా ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. తెలుగుదేశంకు ఎల్లో మీడియా, వైసీపీకి నీలిమీడియా సపోర్టు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక తటస్థ మీడియా గురించి చెప్పనక్కర్లేదు. యాడ్ రెవెన్యూకు ఆశించి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలుకుతుంటాయి. అయితే మీడియా ప్రచారం లేకుండానే జనసేన ప్రజల్లోకి బలంగా వెళుతోంది. మంత్రి రోజా అన్నట్టు జిల్లాకు అధ్యక్షులు లేరు. నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులు లేకుండా జనసేన ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. నిజమే బలం లేకపోయినా.. ప్రజల్లోకి బలంగా వెళ్లడం వెనుక ఉన్న పరమార్ధం మంత్రి రోజా లాంటి వారు తెలుసుకోవాలి.
వైసీపీ గెలుపోటముల మధ్య తాను నిలుస్తానని.. వైసీపీ విముక్త ఏపీయే లక్ష్యంగా పనిచేస్తానన్న పవన్ ప్రకటన వారికి కంటగింపుగా మారింది. అసలు నాయకుడిగా అంగీకరించని వారు…ఆయన మాటలను మాత్రం తట్టుకోలేకపోతున్నారు. బలమే లేని నాయకుడి మాటలను ఎవరు వింటారని వదిలేయవచ్చు కదా. అలాగే పూర్తిస్థాయి రాజకీయాలు చేయడం లేదని ప్రచారం చేశారు. ఇలా రాజకీయ వేదికలపై వస్తే సహించలేకపోతున్నారు. చివరకు ముచ్చటపడి తన సొంత డబ్బులతో తయారుచేసుకున్న వారాహి వాహనంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సగటు వైసీపీ అభిమానికి పవన్ విలన్. ఆయన చర్యలు విధ్వంసం. ఆయన హావాభావాలు వారికి కంపరం. వీటన్నింటి మాటున పవన్ బలాన్ని మాత్రం అంచనా వేయలేకపోతున్నారు. పవన్ రూపంలో వైసీపీకి శృంగభంగం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.