Balineni Srinivas Reddy : ఆయన మాజీ మంత్రి, ఒక దఫా మినిస్టర్ గా ప్రకాశం జిల్లాను ఏలారు. సామాజిక సమీకరణాలు.. రెండున్నరేళ్ల జగన్ కట్టుబాటుతో మంత్రి పదవి కోల్పోయారు. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా జగన్ కు సమీప బంధువు. అత్యంత దగ్గరి వాడు. జగన్ కు ప్రతిపక్షంలో ఉండగా ఎంతో సాయం చేసినవాడు. అందుకే ఈ మూడు జిల్లాల బాధ్యతలను అప్పగించి జగన్ సంతృప్తి పరిచాడు జగన్. కానీ వైసీపీలోని కొన్ని తెరవెనుక శక్తులు మాత్రం ఆయనను తీవ్రంగా అవమానిస్తున్నాయి. ఉక్కపోతకు గురిచేస్తున్నాయి. అవేంటన్నది బాలినేని బయటపెట్టడం లేదు. కానీ పొమ్మన లేక తనకు పొగబెడుతున్నారని తాజాగా బోరుమన్నాడు. బాలినేని కంటతడి పెట్టడానికి అసలు కారణం ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చారు. కొద్దిరోజులుగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించడంతోపాటు.. జరుగుతున్న దుష్ప్రచారంపైన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తనపై కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారంటూ కంటతడి పెట్టారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డాడని, పార్టీ కార్యకర్తల కోసం ఏదైనా చేస్తానని ఈ సందర్భంగా బాలినేని స్పష్టం చేశారు. ‘నేను పార్టీకి కట్టుబడి ఉండడాన్ని కొంత మంది అలుసుగా తీసుకున్నారు. అనవసరంగా నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎవరిపైనా సీఎంకు ఫిర్యాదు చేయలేదు. అలాంటి మనస్తత్వం నాది కాదు. నేను టికెట్ ఇప్పించిన వారే నాపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. నాపై ఆరోపణలు వెనుక ఎవరున్నారో మీరే తెలుసుకోవాలి’ అని బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ నీచులకు పార్టీపై ప్రేమ లేకపోవడం వల్లే విమర్శలు..
పార్టీ అంటే తనకు అభిమానమని, పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పార్టీపైన ప్రేమ లేని వ్యక్తులే నా పై విమర్శలు చేస్తున్నారని, అలాంటి నీచులకు పార్టీ ఏమైనా పరవాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదాలకు అధిష్టానమే ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నానని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో తనపై ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు.
అందుకే రీజనల్ కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా..
ఒంగోలు నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి సారించే ఉద్దేశంతోనే రీజనల్ కో-ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశానని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మూడు జిల్లాల బాధ్యతలు చూడడంతో పాటు గడపగడపకు తిరగలేకనే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పానని, ఆయన వద్దని వారించారని, రాజీనామాను ఆమోదించాలని మరోసారి కోరడంతో సరే అన్నారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. గోనె ప్రకాశరావుకి తన గురించి మాట్లాడే అవసరం ఏముందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేలా కొందరు చేస్తున్నారని, అది ఎవరో అందరికీ తెలుసు అని ఆయన పేర్కొన్నారు. తనపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బాలినేని. అయితే బాలినేని సజ్జలను టార్గెట్ చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారని.. జగన్ కు ఆయనకు దూరం పెట్టేందుకే ఇలా స్కెచ్ గీశారనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి.
వ్యతిరేకంగా ఏమీ జరగడం లేదు..
ఒంగోలు నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా తనకు తెలియకుండా ఏమీ జరగడం లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. డీఎస్పీ నియామకం ఎలా జరిగిందో తనకు తెలియదని, దీనిని సీఎం దృష్టికి తీసుకెళ్లగా కొద్ది రోజుల్లో మారుస్తామన్న హామీని ఇచ్చినట్లు వెల్లడించారు. ఒకరి గురించి ఫిర్యాదు చేసే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు బాలినేని. తనకు వైయస్సార్ రాజకీయ బిక్ష పెట్టారని, పార్టీ కోసం చాలా కష్టపడ్డాను అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. జిల్లాలో తనపై జరుగుతున్న కుట్ర వెనుక బలమైన వ్యక్తి ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటానని, తాను టిక్కెట్లు ఇప్పించిన వారే ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై విమర్శలను కొంతమంది కావాలనే చేయిస్తున్నారని, ఎన్నో నిందలు, ఆరోపణలు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానమే వీటన్నింటికీ ముగింపు పలకాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. జిల్లాలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు వల్లే బాలినేని కంట తడి పెట్టాల్సి వచ్చిందని, దగ్గరి బంధువుతో పెరిగిన దూరమే సమస్యలకు కారణమైందని పలువురు పేర్కొంటున్నారు. ఈ సమస్యను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
