Prema Samajam : సుదీర్ఘ నేపథ్యం విశాఖ ప్రేమ సమాజం సొంతం. ఇది అభాగ్యులకు ఆసరాగా నిలుస్తుంది. అనాధలకు భరోసా కల్పిస్తుంది. పండు టాకులకు తోడుగా నిలుస్తుంది. దీర్ఘకాలిక రోగులకు అండగా నిలుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పేరుకు తగ్గట్లుగానే సమాజానికి ప్రేమను అందిస్తుంది. అనాధాశ్రమంలో చేరిన పిల్లలకు, వృద్ధాశ్రమంలో చేరిన వృద్ధులకు ప్రశాంతమైన జీవితాన్ని కూడా అందిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే వారికి మరో దేవాలయంలో కనిపిస్తుంది. అనాధ పిల్లలు, వృద్ధులను అక్కున చేర్చుకుంటుంది ప్రేమ సమాజం. అయితే దీని నేపథ్యం ఇప్పటిది కాదు. దాదాపు 9 దశాబ్దాల కిందటే ఏర్పాటయింది మహోన్నత ప్రేమ సమాజం.
విశాఖ నగరం నడిబొడ్డులో ఉంటుంది ప్రేమ సమాజం. ఇది స్వచ్ఛంద సంస్థమాత్రమే కాదు. ఎన్నో వేల మంది శరణాలయం. అనాధలను చేరదీయడం, వృద్ధులకు ఆశ్రయం కల్పించడం, ఒంటరి మహిళలను ఆదుకోవడం, బాలికలను చదివించడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. 1930 లో ఏర్పాటు అయింది ఈ సంస్థ. మారెడ్ల సత్యనారాయణ దీనిని స్థాపించారు. 1941లో దీనిని ట్రస్ట్ గా రిజిస్టర్ చేశారు. ప్రేమ సమాజానికి ఉత్తరాంధ్రలో విలువైన ఆస్తులు ఉన్నాయి. రుషికొండలో చెరువు ప్రసాదరావు అనే దాత 1959లో 47.36 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. డాబా గార్డెన్స్ లోని ప్రేమ సమాజం ప్రధాన కార్యాలయ ప్రాంగణం ఎకరా 88 సెంట్లలో ఉంది. ఇందులో వృద్ధుల శరణాలయం, గోశాల, అనాధ బాలల కేంద్రం నడుస్తున్నాయి. వృత్తి శిక్షణా కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ప్రాథమిక ఆసుపత్రి కూడా ఇందులో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 70 మంది వరకు వృద్ధులు, మరో 20 మంది వరకు పాలలో ఉన్నారు.
ఫిక్స్ డిపాజిట్ల రూపంలో ప్రేమ సమాజానికి చెందిన రెండు కోట్ల పైచీలుకు నగదు ఉంది. స్థిరాస్తులు వందల కోట్ల రూపాయలు కావడం విశేషం. చంగల్ రావు పేటలో 2148 గజాల స్థలంలో లెప్రసీ కేంద్రం, సోల్జర్ పేటలో 380 గజాల స్థలం ఉంది. రుసికొండలో 47.33 ఎకరాల స్థలంలో.. 33 ఎకరాల స్థలం లీజుకు ఉంది. భీమిలిలో 60 గజాలు, మరోచోట 23 సెంట్లు స్థలం ఉంది. చోడవరంలో దాదాపు 6 1/2 ఎకరాల భూమి ఉంది. శ్రీకాకుళం గుజరాతిపేటలో 61 సెంట్లు, నరసన్నపేటలో 21 సెంట్లు, విజయనగరం జిల్లా జామి లో 19.48 సెంట్లు స్థలం ఉంది.
ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి వ్యవహరించేవారు. ఆయన విశాఖ విలువైన భూములను బినామీల పేరిట కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రుషికొండలో 33 ఎకరాల లీజుకు సంబంధించి.. వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణను ప్రారంభించింది. అయితే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఈ భూముల లీజులో నిబంధనలు పాటించలేదని ప్రభుత్వానికి నివేదించారు. మరి కొన్ని రకాల ఉల్లంఘనలో సైతం జరిగాయని ప్రభుత్వానికి తెలియజేశారు. ఆ సమయంలోనే ప్రేమ సమాజానికి ప్రభుత్వ పరంగా ఇచ్చిన కొన్ని వేసుల బాటులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఉత్తరాంధ్రలోప్రభుత్వ భూములను దోచుకున్నారన్న ఆరోపణలు వైసీపీ నేతలపై ఉన్నాయి. ప్రధానంగా రుషికొండ ప్రాంతంలో విజయసాయిరెడ్డి భారీ భూదోపిడికి తెర తీశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రేమ సమాజం భూములపై కన్నేసారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. నాడు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతి ఈ విషయంలో శరవేగంగా పావులు కదిపారు. విజయసాయిరెడ్డి అడిగిందే తడవుగా ఫైళ్లు కదిలించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి.. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలపై వివాదం నడిచింది. ఈ తరుణంలోనే ప్రేమ సమాజం ప్రస్తావన వచ్చింది. ప్రేమ సమాజం భూముల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించే అవకాశం కనిపిస్తోంది